నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన ఏటీఎం దొంగల ముఠా కోసం కామారెడ్డి డివిజన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన ఏటీఎం దొంగల ముఠా కోసం బుధవారం కామారెడ్డి డివిజన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గాంధారీ, నిజామాబాద్ మండలాల్లో కూంబింగ్ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఏటీఎం దొంగల ముఠా ఆటకట్టించేందుకు స్వయంగా ఆ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము సమయాల్లో నిజామాబాద్లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా చోరీలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ చోరీలో సుమారు 43 లక్షల రూపాయల వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అదే విధంగా బుధవారం వేకువజామున మెదక్ ఆటోనగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచేందుకు దుండగులు యత్నించగా ఏటీఎం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో దొంగల ముఠా పరారయింది. బొలెరో వాహనంలో పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించారు. అనంతరం లింగంపేట పోలీసులకు సమాచారం అందించారు. నాగిరెడ్డి పేట ఎస్సై దొంగల ముఠాను వెంబడించగా తప్పించుకున్నారు.