రామిరెడ్డి కాలువపై ఆక్రమణల తొలగింపు
నెల్లూరు, సిటీ: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని మద్రాసు బస్టాండ్ సమీపంలోని రామిరెడ్డి కాలువపై ఆక్రమణలను నగర పాలక సంస్థ అధికారులు శనివారం తొలగించారు.
-
పేదలకు వైఎస్సానగర్‌లో పునరావాసం
-
26 గృహాలకు గానూ 16 ఇళ్ల కేటాయింపు
-
ఆవేదన వ్యక్తం చేస్తున్న మిగిలిన బాధితులు
నెల్లూరు, సిటీ: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని మద్రాసు బస్టాండ్ సమీపంలోని రామిరెడ్డి కాలువపై ఆక్రమణలను నగర పాలక సంస్థ అధికారులు శనివారం తొలగించారు. రామిరెడ్డి కాలువపై పేదలు ఇళ్లు నిర్మించుకుని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్ అధికారులు పేదల నివాసాలకు నోటీసులు జారీ చేశారు. కాలువపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం గృహాలను తొలగించి అందులో నివాసం ఉంటున్న వారికి వైఎస్సార్‌నగర్‌లోని ఇందిరమ్మ కాలనీలో పునరావాసం కల్పించారు. కాలువపై మొత్తం 26 కుటుంబాలు ఉండగా, 16 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 10 కుటుంబాలకు పునరావాసం కల్పించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారి రంగరాజు బాధితులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 16మందికి పునరావాసం కల్పించామని, మిగిలిన 10 మంది విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు కూలిపోతాయని ఆందోళన
ఇటీవల ఇందిరమ్మ గృహాల్లో ఓ భవనం శ్లాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో గృహాల్లో నివాసం ఉండేందుకు పేదలు భయపడుతున్నారు. నాసిరకంగా నిర్మించిన నివాసాల్లో రక్షణ ఏ మేరకు ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.