breaking news
encroachments demolished
-
ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
న్యూఢిల్లీ: వదంతులు షికార్లు చేయడంతో భూముల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కాస్తా హఠాత్తుగా మసీదు కూల్చివేత రంగు పులుముకుని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన సమీప ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఫయీజ్ ఇలాహీ మసీదులోని ఆక్రమణలను తొలగించేందుకు మంగళవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికా రులు, పోలీసులుపైకి స్థానికులు రాళ్లు, ఇటుకలు, గాజుసీసాలను రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టే ప్రయత్నంచేశారు. రాళ్లు, గ్లాస్ బాటిళ్లను రువ్విన ఘటనలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఘటనకు కారకులైన మైనర్‌సహా ఐదుగురిని పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. రామ్‌లీలా మైదాన్ సమీపంలోని ఫయీజ్ ఇలాహీ మసీదు, తుర్క్‌మన్ గేటు సమీప స్మశానవాటిక దగ్గర్లోని భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆక్రమణలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగడంతో చివరకు అది ఉద్రిక్తతలకు దారితీసింది. ఆక్రమణల తొలగింపులో భాగంగా అక్కడి మసీదును నేలకూలుస్తున్నారని ఒక ఆకతాయి పెట్టిన సోషల్‌మీడియా పోస్ట్‌తో పుట్టగొడుగుల్లా పుకార్లు పుట్టుకొచ్చి చివరకు ఘర్షణకు దారితీసింది. ఢిల్లీ సెంట్రల్ పోలీస్ కమీషనరేట్‌కు సంబంధించిన ఈ స్థలంలో అక్రమంగా వెలసిన డయాగ్నస్టిక్ సెంటర్, ఫంక్షన్ హాల్‌ను తొలగించామని అక్కడి మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వివేక్ స్పష్టంచేశారు. తప్పుడు వీడియోతో అలజడిఅక్రమ కట్టడాలను కూల్చేందుకు కూలిన భవన శిథిలాలు, చెత్తను తొలగించేందుకు 30 బుల్డోజర్లు, 50 డంపింగ్ ట్రక్కులను తీసుకురావడంతో స్థానికులు ఇదంతా చూసి గుమిగూడారు. 300 మంది పౌరకార్మికులను శిథిలాలను తొలగించేందుకు అధికారులు వెంట తీసుకొచ్చారు. స్థానికులు సమీపంలోకి రాకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. మంగళవారం అర్ధరాత్రిదాటాక ఆక్రమించిన స్థలంలోని వాణిజ్యసముదాయాలను కూల్చేస్తున్న వీడియోను ఒక వ్యక్తి వీడియో తీసి ‘‘మసీదును కూల్చేస్తున్నారు. అందరూ వెంటనే ఇళ్ల నుంచి బయటికొచ్చి ఉద్య మాన్ని ఉధృతం చేయండి’’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో పెద్దసంఖ్యలో స్థానికులు రాళ్లు పట్టుకుని రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు, సీసాలు విసిరేస్తూ దాడికి దిగారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు వీడియోలు పోస్ట్చేసినందుకు, ఉద్రిక్తపరిస్థితులు సృష్టించినందుకు 17 ఏళ్ల బాలుడుసహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. -
రామిరెడ్డి కాలువపై ఆక్రమణల తొలగింపు
పేదలకు వైఎస్సానగర్లో పునరావాసం 26 గృహాలకు గానూ 16 ఇళ్ల కేటాయింపు ఆవేదన వ్యక్తం చేస్తున్న మిగిలిన బాధితులు నెల్లూరు, సిటీ: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని మద్రాసు బస్టాండ్ సమీపంలోని రామిరెడ్డి కాలువపై ఆక్రమణలను నగర పాలక సంస్థ అధికారులు శనివారం తొలగించారు. రామిరెడ్డి కాలువపై పేదలు ఇళ్లు నిర్మించుకుని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్ అధికారులు పేదల నివాసాలకు నోటీసులు జారీ చేశారు. కాలువపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం గృహాలను తొలగించి అందులో నివాసం ఉంటున్న వారికి వైఎస్సార్‌నగర్‌లోని ఇందిరమ్మ కాలనీలో పునరావాసం కల్పించారు. కాలువపై మొత్తం 26 కుటుంబాలు ఉండగా, 16 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 10 కుటుంబాలకు పునరావాసం కల్పించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారి రంగరాజు బాధితులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 16మందికి పునరావాసం కల్పించామని, మిగిలిన 10 మంది విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కూలిపోతాయని ఆందోళన ఇటీవల ఇందిరమ్మ గృహాల్లో ఓ భవనం శ్లాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో గృహాల్లో నివాసం ఉండేందుకు పేదలు భయపడుతున్నారు. నాసిరకంగా నిర్మించిన నివాసాల్లో రక్షణ ఏ మేరకు ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.


