ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ! | Employees more disappointed on their demands from govt | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ!

Nov 6 2015 2:05 AM | Updated on Sep 3 2017 12:04 PM

ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ!

ఉద్యోగుల ఎదురుచూపు ఓ అంతులేని కథ!

పదో పీఆర్సీకి కేబినెట్ ఆమోదముద్ర వేయడం.. పీఆర్సీ జీవోల జారీ, డీఏ పెంపు, హెల్త్‌కార్డులు తదితర విషయాల్లో రాష్ట్ర సర్కారు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పీఆర్సీ ప్రకటించి దాదాపు 11 నెలలు
జీవోలివ్వకుండా అంతులేని జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పిల్లల సంరక్షణ సెలవులను కోల్పోతున్న మహిళా ఉద్యోగులు
తెలంగాణలో దీపావళి కానుకగా రెండో డీఏకి సిద్ధం
ఏపీలో ఇంతవరకూ తొలి డీఏకే దిక్కులేదు...
జేఏసీ నాయకత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
సర్కారుతో అంటకాగుతూ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం
 డిమాండ్లపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీకి కేబినెట్ ఆమోదముద్ర వేయడం.. పీఆర్సీ జీవోల జారీ, డీఏ పెంపు, హెల్త్‌కార్డులు తదితర విషయాల్లో రాష్ట్ర సర్కారు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడం వారిని తీవ్రం గా బాధిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినవన్నీ మాయమాటలేనని తేలిపోయింద ని వారు మండిపడుతున్నారు. ఎప్పుడడిగినా వచ్చే కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామం టూ ప్రభుత్వం దాటవేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటామని ప్రభుత్వం చెప్పడం మాటలకే పరిమితమని, పీఆర్సీ ప్రకటించి 11 నెల లు కావస్తున్నా, ఫిట్‌మెంట్ మినహా మరో జీవో ఇవ్వడానికీ ప్రభుత్వానికి మనసు రావట్లేదని విమర్శిస్తున్నారు.
 
 తెలంగాణలో ఈ ఏడాది దీపావళి కానుకగా రెండో డీఏ ఇవ్వడానికి కూడా అక్కడి ప్రభుత్వం సమాయత్తమవుతోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలి డీఏకే దిక్కులేదని వారు వాపోతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తున్న విషయం తమకు అర్థమైనా.. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం మాత్రం అర్థమైనా.. కానట్లుగా నటిస్తూ స్వార్థప్రయోజనాలకోసం సర్కారుతో అంటకాగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులు సంక్షేమం ప్రభుత్వానికి పట్టదని తేలిపోయినా జేఏసీ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తుండడమేంటంటూ మండిపడుతున్నారు. సర్కారు నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టేందుకు, డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
పట్టించుకోని ప్రభుత్వం..
పీఆర్సీపై ఎప్పుడడిగినా.. వచ్చే కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రులు మభ్యపెడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా నవంబర్ రెండున జరిగిన కేబినెట్ సమావేశ ఎజెండాలో కూడా పీఆర్సీ జీవోలు, డీఏ పెంపు ప్రతిపాదనను చేర్చకపోవడం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. పీఆర్సీ జీవోలు వెలువడడంలో జాప్యం వల్ల ఉద్యోగులకు అనేక నష్టాలు కలుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వారు విమర్శించారు.
 
 కదలని జేఏసీ నాయకత్వం..
 ఇదిలా ఉండగా తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగసంఘాల జేఏసీ నాయకత్వం చురుగ్గా వ్యవహరించట్లేదన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ఉపక్రమించాల్సిన జేఏసీ.. మీనమేషాలు లెక్కిస్తుండడం ఇందుకు నిదర్శనమంటున్నారు. నవంబర్ 2నాటి మంత్రివర్గ భేటీలో పీఆర్సీ నివేదికకు ఆమోదముద్ర వేయకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని గతనెల 29న జరిగిన జేఏసీ కార్యానిర్వహకవర్గ సమావేశంలో తీర్మానించారు. అయితే కేబినెట్‌లో ఈ అంశం ప్రస్తావనకు కూడా రాకపోయినా జేఏసీ మౌనం పాటించడాన్ని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణను జేఏసీ ప్రకటిస్తుందని భావించినా ఎలాంటి స్పందన లేకపోవడం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి ఉద్యోగుల వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్న ప్రభుత్వపెద్దలు.. ఈ విషయంలో తమకెలాంటి ఇబ్బంది రాకుండా కొద్దిమంది జేఏసీ నేతల్ని తమ కనుసన్నల్లో ఉంచుకుంటే సరిపోతుందనే ధోరణితో ఉన్నారు. ఏడాదిగా అదేవిధానాన్ని  అమలు చేస్తున్నారు. పీఆర్సీ జీవోలు, డీఏ పెంపు ప్రతిపాదనలను కేబినెట్ ఎజెండాలో చేర్చకపోయినా జేఏసీ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది.
 
 నేతలపై తీవ్రమైన ఒత్తిడి..

తమ నేతల స్వార్థ ప్రయోజనాలకు ఉద్యోగుల ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని, కనీసం గట్టిగా అడగడమూ చేతకావట్లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల నేతలపై ఒత్తిడి పెరిగింది. దీంతో వారు జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపట్ల చిత్తశుద్ధితో ఉంటుందనే భ్రమలు తొలగిపోయాయి. గట్టిగా అడిగితే తప్ప.. స్పందించే పరిస్థితి లేదు. సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే ఉద్యోగులు దారుణంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జేఏసీ నాయకత్వం తక్షణం స్పందించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి’ అని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
 పీఆర్సీ జీవోల జాప్యంతో నష్టాలివీ..
 జీవోల జాప్యం జరిగేకొద్దీ ఉద్యోగులకు కలిగే నష్టాల్ని వివిధ సంఘాల నేతలు ఉదహరిస్తున్నారు. అవిలా..
 - మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే రెండో బిడ్డ వయసు 18 ఏళ్లు నిండేలోపే దీన్ని వినియోగించుకోవాలనే నిబంధన విధించింది. పీఆర్సీని నోషనల్‌గా 2013 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. జీవో జారీలో జరుగుతున్న జాప్యం వల్ల.. పీఆర్సీ అమలయ్యే తేదీనాటికి 16 ఏళ్ల వయసు కలిగిన పిల్లలున్న ఉద్యోగినులు ఈ సెలవును వాడుకునే అవకాశాన్ని కోల్పోయారు.
 - పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం.. 25 సంవత్సరాల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఈ జీవో రాకపోవడంతో.. 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి 2013 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసినవారు పూర్తి పెన్షన్ పొందే అర్హతను కోల్పోయారు.
 - పీఆర్సీ అమల్లోకి వచ్చిన 2013 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసినవారికి పదో పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా గ్రాట్యు టీ, కమ్యుటేషన్ పెంచాలి. కానీ ప్రభుత్వం ఈ మేరకు జీవోలివ్వకుండా తాత్సారం చేసినందువల్ల.. పెన్షనర్లకు పెన్షన్ మొత్తం ఇప్పటికీ ఖరారు కాలేదు.
 
డీఏ కూడా గట్టిగా అడగట్లేదు..
 ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డీఏ పెరుగుతుంది. కేంద్రం ప్రకటించే డీఏ పెంపు ఆధారంగా రాష్ట్రంలోనూ డీఏ పెంచుతూ ఉత్తర్వులిస్తారు. రొటీన్‌గానే డీఏ ఉత్తర్వులొస్తాయి. తెలంగాణలో ఈ ఏడాది దీపావళి కానుకగా రెండో డీఏ ఇవ్వడానికి కూడా అక్కడి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలి డీఏకే దిక్కులేదు. డీఏ ఇవ్వాలని కూడా జేఏసీ గట్టిగా అడగట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement