పదో తరగతి ఫలితాల్లో గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం తగ్గితే అందరికీ అవమానం..పక్కాగా ప్రణాళిక అమలు చేయాలని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పగడాల లక్ష్మీనారాయణ సూచించారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ఫలితాల్లో గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం తగ్గితే అందరికీ అవమానం.. పక్కాగా ప్రణాళిక అమలు చేయాలని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పగడాల లక్ష్మీనారాయణ సూచించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వార్షిక ప్రణాళిక తయారీకి హెచ్‌ఎంలతో మంగళవారం స్థానిక కొత్తూరు బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పెనుకొండ, గుత్తి డివిజన్లు, మధ్యాహ్నం అనంతపురం, ధర్మవరం డివిజన్ల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.
ఏడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈనెల 27 నుంచి మార్చి 16 వరకు ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునే వాతావరణం కల్పించాలన్నారు. సీ,డీ గ్రేడు విద్యార్థులపై ప్రతి ఉపాధ్యాయుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఐదుగురు విద్యార్థులను గ్రూపుగా చేసి అందులో అన్ని గ్రేడుల విద్యార్థులుండేలా చూడాలన్నారు. దత్తత తీసుకున్న విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఉదయం 9.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పాఠశాల కాలనిర్ణయ పట్టిక మేరకు తరగతులు యథావిధిగా నిర్వహించాలన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పాఠశాలస్థాయిలో ప్రశ్నపత్రం తయారుచేసి రోజువారి పరీక్షను 25 మార్కులకు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, డిప్యూటీ డీఈఓలు నాగభూషణం, చాంద్‌బాషా, హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు పాల్గొన్నారు.