‘హత్నూర’ను మెదక్‌లో కలపొద్దు | dong merge hatnoora in medak | Sakshi
Sakshi News home page

‘హత్నూర’ను మెదక్‌లో కలపొద్దు

Sep 7 2016 7:26 PM | Updated on Sep 4 2017 12:33 PM

హత్నూర మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం చేసేందుకు శ్రీకారం చుడతామని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి అన్నారు.

  • టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి
  • హత్నూర: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన పునర్నివిభజన ముసాయిదా ప్రకారం  హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కొనసాగించాలని, మెదక్‌ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం చేసేందుకు  శ్రీకారం చుడతామని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి అన్నారు.

    బుధవారం మండలంలోని మంగాపూర్‌లో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ,, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి దేవేందర్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు.

    కొందరు స్వార్థ రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో గెలిచి... ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా హత్నూర మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భవిష్యత్‌ తరాల కోసం హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

    టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డిఖానాపూర్‌ సర్పంచ్‌ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం హత్నూర మండల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే మెదక్‌ జిల్లాలో కలిపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు భయపడి ఆయన చెప్పినట్లు తల ఊపుతున్నారని అన్నారు.

    హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి గతంలోనే కలెక్టర్‌కు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హత్నూర మండలాన్ని మాత్రం సంగారెడ్డి జిల్లాలో కొనసాగించాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటామన్నారు.

    జెడ్పీటీసీ పల్లె జయశ్రీ మాట్లాడుతూ హత్నూర మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలన్నారు. 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెదక్‌లో కలపాలని చూస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో సర్పంచులు బంటుశ్రీనివాస్‌, ఈశ్వరమ్మ నర్సింలు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రావణ్‌కుమార్, యాదగిరి, రాములు, పోచయ్య, ప్రవీణ్‌, సుధాకర్‌, మారుతిరాజు, బి.నర్సింహారెడ్డి, అర్జున్‌, రాజు, సురేందర్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ, సద్గుణచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement