సత్యదేవునిపై సినిమా తీస్తా


 • నటుడు, దర్శకుడు యనమదల కాశీ విశ్వనాథ్

 •  

  అన్నవరం :

  సత్యదేవుని ఆలయ చరిత్ర, స్వామి వారి వ్రతకథలో అంశాలను తీసుకుని ఓ సినిమా తీసే ఆలోచన ఉందని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు యనమదల కాశీవిశ్వనాథ్‌ అన్నారు. గురువారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  ఈ జిల్లా వాడినే..

  నేను ఈ జిల్లా వాడినే. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, పురుషోత్తపట్నంలో పుట్టాను. సుమారు 25 సంవత్సరాల నుంచి సినీరంగంలో ఉన్నా.

  నటుడిగా వందకు పైగా సినిమాలు..

  ఇప్పటివరకూ వందకు పైగా సినిమాల్లో నటించా. వాటిలో ‘నచ్చావులే, నమో వెంకటేశ, డిక్టేటర్, గోవిందుడు అందరివాడు, గ్రీకు వీరుడు, పరమవీరచక్ర, మిస్టర్‌ పర్‌ఫెక్ట్, లడ్డూబాబు’ తదితర సినిమాలు పేరు తెచ్చాయి. ప్రస్తుతం ‘వైశాఖం, మా అబ్బాయి, మసకలీ’ తదితర పది సినిమాల్లో నటిస్తున్నా.

  దర్శకుడిగా పేరు తెచ్చిన ‘నీవు లేక నేను లేను’

  సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద తరుణ్, ఆర్తీ అగర్వాల్‌ హీరో, హీరోయిన్‌లుగా నిర్మాత రామానాయుడు నిర్మించిన ‘ నీవు లేక నేను లేను’ సినిమాకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. అందులో ఒక పాట కూడా రాశా. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘తొలిచూపు’ సినిమా కూడా డైరెక్టర్‌గా చేశా.

  మర్చిపోలేని అనుభవం..

  నా దర్శకత్వంలో మూడో సినిమాకు కథా చర్చల కోసం అన్నవరం సత్యదేవుని ఆలయానికి వచ్చినప్పుడు ‘నచ్చావులే ’ సినిమాలో నటించమని పిలుపు వచ్చింది. అదే నాకు తొలి సినిమా. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించా. ఇది నేను మర్చిపోలేని అనుభవం. అందువల్లే జిల్లాకు వచ్చిన ప్రతిసారీ స్వామిని దర్శించుకుంటా.

   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top