ఊరి చివరన గుడిసెలు.. రెండు గ్లాసుల పద్ధతి... దేవుడి దర్శనమూ కరువే.. అగ్ర వర్ణాల వారిని కనీసం తాకకూడదు.
- దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్న జనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన దళితులు
కంబదూరు : ఊరి చివరన గుడిసెలు.. రెండు గ్లాసుల పద్ధతి... దేవుడి దర్శనమూ కరువే.. అగ్ర వర్ణాల వారిని కనీసం తాకకూడదు.. ఇలా చెబుతూపోతే దళితులపై ఓకానొక సందర్భంలో ఎన్నో ఆంక్షలు ఉండేవి. ఈ కులవివక్షతను నిర్మూలించేందుకు ఎన్నో చట్టాలను కూడా చేయాల్సి వచ్చింది. అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారికి అవమానం జరుగుతూనే ఉంది. తాజాగా మండలంలోని వెంకటంపల్లిలో ఇటీవల ఆంజనేయస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఇందులో భాగంగానే శనివారం దళితులు పూజలు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న కొంత మంది అగ్రవర్ణలకు చెందిన వ్యక్తులు మీరు ఆలయంలోకి వస్తే మా గ్రామానికి అరిష్టం అంటూ వారిని ఆలయంలోకి రాకుండా అడ్డుకుని దాడికి యత్నించారు.
అయితే ఈ ఆలయ నిర్మాణానికి తాము కూడా డబ్బులు ఇచ్చామనీ, మాకు కూడా ఆలయంలోకి రావడానికి హక్కు ఉందని ఆ దళితులు వారికి స్పష్టం చేశారు. మీరు చందాలు ఇచ్చినా సరే ఆలయంలోకి మాత్రం రానిచ్చేదిలేదనీ.. మీకిష్టమొచ్చిన వారికి చెప్పుకోండంటూ దౌర్జన్యంగా కులం పేరుతో దూషిస్తూ వారిని కించపరిచారు. ఇదే విషయంపైనే ఆదివారం దళితులు కంబదూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని మొత్తం ఎస్‌ఐ నరసింహుడుకి చెప్పి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.