రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటల గారడీ కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు.
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటల గారడీ కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ... ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా హామీ తనవల్లే వచ్చిందని గతంలో వెంకయ్యనాయుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
మాటల గారడీతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లాలో రూ.900 కోట్లతో బెల్ పరిశ్రమ, రూ.500 కోట్లతో కస్టమ్స్ అకాడమీ స్థాపించినట్లు గొప్పగా చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం దారుణమన్నారు. 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను జిల్లాలో ప్రారంభించినట్లు చెబుతున్న ఆయనకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించలేదనే విషయం తెలీదా..? అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూనే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలన్నారు.