కార్పొరేట్‌ స్థాయిలో పోలీస్‌ స్టేషన్‌ భవనాలు | Corporate buildings at the police station | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్థాయిలో పోలీస్‌ స్టేషన్‌ భవనాలు

Dec 14 2016 3:25 AM | Updated on Sep 22 2018 8:06 PM

పోలీసులకు ఆధునాతన సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్‌ స్థాయిలో రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

బీబీనగర్‌ : పోలీసులకు ఆధునాతన సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్‌ స్థాయిలో రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.    బీబీనగర్‌లో  మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని, భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా పోలీస్‌ విశ్రాంతి భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 42కోట్లతో 24 మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిధులకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ భవనానికి రూ. 10లక్షలకు మించకుండా వెచ్చించి పాత భవనాలకు బదులుగా నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్‌ అయిన చౌటుప్పల్‌లో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత సామరస్యం, లా అండ్‌ ఆర్డర్‌ బాగుండాలని కోరుకోవడంతోనే గత ప్రభుత్వాలు చేయలేని విధంగా పోలీస్‌ శాఖకు 350కోట్ల రుపాయల నిధులు మంజూరు చేసి పోలీస్‌ వ్యవస్థలో మార్పు తెచ్చారని అన్నారు.

పోలీస్‌ స్టేషన్లలో ఇప్పుడు పాత విధానాలు పోయి కొత్త విధానాలు వచ్చాయని ఫిర్యాదుదారులు ఇచ్చే దరఖాస్తులు అన్ని ఆన్‌లైన్‌లో పెడుతారని అవి వెంటనే డీజీపీ వరకు వెళ్తాయన్నారు. దొంగతనాలను అరికట్టడానికి, నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విఫ్‌ గొంగిడి సునిత మాట్లాడుతూ గత ప్రభుత్వాలు స్వలాభాల కోసం పోలీస్‌లను వాడుకొని ప్రజలకు నమ్మకం లేకుండా చేశాయని ఆరోపించారు.  ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ శాంతి భద్రతలు ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో శాంతి భద్రతలు అద్భుతంగా మారాయని అన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పోలీస్‌ స్టేషన్‌ అంటే ఖైదీల భవనం అనే భావన ప్రజల్లో కలగకుండా బీబీనగర్‌లో నిర్మించిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం కౌన్సిలింగ్‌ భవనంలా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక 24గంటల్లో నేరస్తులను పట్టుకునేలా పోలీస్‌ వ్యవస్థ మారిందని పేర్కొన్నారు.

సీఎం డైరెక్షన్‌తోనే:  అంజన్‌కుమార్, అడిషనల్‌ డీజీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్, డైరెక్షన్‌తోనే రెండేళ్లలో రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థలో మార్పు వచ్చిం దని అడిషనల్‌ డీజీ అంజన్‌కుమార్‌ అన్నారు. అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ శాంతి భద్రతల కోసం కృషి చేస్తామని అన్నారు.

ప్రజాప్రతినిధులు సహకరించాలి: సీపీ మహేష్‌ భగవత్‌
యాదాద్రిభువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి రావడంతో పోలీస్‌ విధి విధానాల్లో మార్పులు వచ్చాయని దీంతో ప్రజా ప్రతినిధులు సహకరించాలని సీపీ భగవత్‌ అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్, మహిళలకు భద్రత కల్పించాలని స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనితా రామచంద్రన్, పోలీస్‌ హౌసింగ్‌శాఖ ఎండీ మల్లారెడ్డి, జాయింట్‌ సీపీ శశిధర్‌రెడ్డి, డీసీపీ యాదగిరి, ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, సర్పంచ్‌ స్వరుపారాణి, జెడ్పీటీసీ బస్వయ్య, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఏసీపీ మోహన్‌రెడ్డి, వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement