గొప్పలొద్దు.. నీరు కావాలి : సుదర్శన్‌రెడ్డి | congress leader sudarshan reddy fires on telangana govt over water problems in nizamabad | Sakshi
Sakshi News home page

గొప్పలొద్దు.. నీరు కావాలి : సుదర్శన్‌రెడ్డి

Jun 23 2016 8:38 AM | Updated on Oct 17 2018 6:06 PM

తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే.. తెలంగాణ సర్కారు అభివృద్ధి పేరిట గొప్పలతో కాలం వెళ్లదీస్తుందని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు.

నీటి ఎద్దడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
తక్షణమే సర్కారు పరిష్కరించాలి
కలెక్టర్ సీరియస్‌గా స్పందించాలి
---మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి


బోధన్: తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే.. తెలంగాణ సర్కారు అభివృద్ధి పేరిట గొప్పలతో కాలం వెళ్లదీస్తుందని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 19వ వార్డులో బోరు మోటారు ప్రారంభించారు.

అనంతరం నీటి పారుదలశాఖ విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. రూ.వేల కోట్లతో ప్రారంభించిన వాటర్‌గ్రిడ్ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, పశువులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుంటే.. అధికార యంత్రాంగంలో ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత లేకపోవడం ప్రభుత్వ పాలన తీరు, నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షకు పైగా జనాభా ఉన్న బోధన్ పట్టణంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నీటి ఎద్దడికి బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ యోగతారాణా సీరియస్‌గా స్పందించాలన్నారు.
 
వార్డుల్లో నీటి ఎద్దడి నివారణకు 30 మోటర్ల వితరణ
 పట్టణంలోని నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను తమ పార్టీతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు తన దృష్టికి తెచ్చారని మాజీ మంత్రి వెల్లడించారు. ప్రజల నీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్య తీవ్ర ఉన్న వార్డుల్లో కొత్తగా వేసిన బోర్లకు సొంత డబ్బులతో 30 మోటర్లను అందించానని, తమ పార్టీ కౌన్సిలర్లు, ఆయా వార్డుల్లో నాయకులు బోర్లు వేయించి మరో 10 మోటార్లను బిగించారన్నారు. అనంతరం పట్టణంలోని గోశాల రోడ్డులో గల మున్సిపల్ 19వ వార్డులో బోరు మోటారును ప్రారంభించా రు. పలువార్డుల్లో పర్యటించిన ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గుణప్రసాద్, అబ్బగోని గంగాధర్‌గౌడ్, కౌన్సిలర్లు దాము, పౌల్, మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు నరేంధర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫసియోద్దీన్, రమేశ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement