కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్' | commando bullet injury due to misfire | Sakshi
Sakshi News home page

కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్'

Dec 5 2015 7:11 AM | Updated on Sep 3 2017 1:33 PM

కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్'

కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్'

సీఎం భద్రత కోసం రాత్రి వేళలో నిఘా పర్యవేక్షించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) సిబ్బందిలో ఓ కమాండోకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం సృష్టించింది.

సీఎం భద్రతా సిబ్బందిలో కమాండోకు బుల్లెట్ గాయం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు
 
మంగళగిరి : సీఎం భద్రత కోసం రాత్రి వేళలో నిఘా పర్యవేక్షించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) సిబ్బందిలో ఓ కమాండోకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటిస్తుంటారు.

వారి భద్రతా చర్యల నిమిత్తం ఎన్‌ఎస్‌జీ సిబ్బంది 140 మందితో కూడిన బృందం పట్టణంలోని ఆరవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో బస చేస్తోంది. వీరు రాత్రి వేళ గస్తీ తిరుగుతూ విధులు నిర్వహిస్తుంటారు. అగ్రనేతల భద్రత నిమిత్తం రాత్రివేళ కొండ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ఇంటిలిజెన్స్‌కు నివేదిక ఇచ్చే నిమిత్తం నాలుగు రోజులుగా 140 మంది కమాండో బృందం మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు.
 
ఈ క్రమంలో విధులలో భాగంగా గురువారం విజయవాడలోని ఓ వాణిజ్య సముదాయంలో శిక్షణ పొందేందుకు వెళ్తుండగా ఎన్‌ఎల్‌కే శ్రీనివాస్ అనే కర్ణాటకకు చెందిన కమాండో జాకెట్‌లో వున్న 9 ఎంఎం పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో అతని కుడి కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే తోటి సిబ్బంది, అధికారులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన వారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు.
 
కాగా, కర్ణాటక రాష్ట్రంలోని మిద్యానగర్‌కు చెందిన శ్రీనివాస్ 2002లో ఆర్మీలో చేరి ఏడాది క్రితం హర్యానా రాష్ట్రం తరఫున ఎన్‌ఎస్‌జీలో శిక్షణ పొందుతున్నాడు. సీఎం తదితర ప్రముఖుల భద్రతకు నియమించిన కమాండోలే నిర్లిప్తంగా ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై పట్టణ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement