ఇక అంగన్‌వాడీలన్నీ మనవారికే! | CM CHANDRABABU IN THE CONFERENCE OF TIRUPATHI | Sakshi
Sakshi News home page

ఇక అంగన్‌వాడీలన్నీ మనవారికే!

Nov 15 2015 2:24 AM | Updated on Aug 14 2018 11:24 AM

ఇక అంగన్‌వాడీలన్నీ మనవారికే! - Sakshi

ఇక అంగన్‌వాడీలన్నీ మనవారికే!

రాష్ర్టంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ సమయంలో టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు

♦ తిరుపతి మేధోమథన సదస్సులో సీఎం చంద్రబాబు
♦ ఆ మేరకు కలెక్టర్లకు సూచించానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్/ తిరుపతి: రాష్ర్టంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ సమయంలో టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ప్రారంభమైన టీడీపీ ఏపీ కమిటీ దిశా నిర్దేశ సదస్సు శనివారం ముగిసింది. రెండో రోజు జన చైతన్యయాత్రల సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు బృందాలుగా ఏర్పడి పలు సమస్యలపై చర్చించారు. వచ్చిన సూచనలపై చంద్రబాబు స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న అందరినీ తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, అలా కాకుండా ఇక ముందు నియమించే వారిలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ఇలాంటి అంశాలను ఇక ముందు ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించవద్దని నేతలకు సూచించారు. ఇప్పటికే వ్యవసాయ కమిటీలు, సాగునీటి సంఘాలతో సహా పలు కమిటీలను పార్టీ కార్యకర్తలతో భర్తీ చేసిన చంద్రబాబు ఇప్పుడు అంగన్‌వాడీలను కూడా పార్టీ వారితో భర్తీ చేస్తామని చెప్పడంపట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

 జన్మభూమి కమిటీలకే బాధ్యతలు
 జన్మభూమి కమిటీలను పటిష్టం చేసి ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలని చంద్రబాబు చెప్పారు. ఏటా 40వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ నిర్వహించే జనచైతన్య యాత్రలో పార్టీ యంత్రాంగం మొత్తం పాల్గొనాలని సూచించారు.

 నెలాఖరులోగా కమిటీ పదవుల భర్తీ..
 గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల పదవులను నెలాఖరులోగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం పార్టీ ప్రతినిధులకు సూచించారు. ప్రతీ మూడు నెలలకోసారి మేధోమథన సదస్సు నిర్వహించి సమీక్షించుకుంటామని తెలి పారు. టీడీపీ ఏపీ కమిటీ అధ్యక్షుడు కె.కళావెంకట్రారావు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, కేంద్రమంత్రి ఆశోక గజపతిరాజు, తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

 విద్యార్థులకు పురస్కారాల అందజేత
 సాక్షి, చిత్తూరు: విద్యార్థులను ప్రోత్సహించి, వారిలో స్ఫూర్తి నింపేందుకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోని తారకరామ స్డేడియంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement