breaking news
Ashoka gajapatiraju
-
ఉడాన్‌లోకి 325 మార్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్లను ప్రభు త్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్ కింద రెండో రౌండ్ బిడ్డింగ్ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం వెల్లడించారు. మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు. కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్కూ ఉడాన్ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు. విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత మార్గాలు ఆరు నెలల్లోపే అందుబాటులోకి వస్తాయని అశోక్ గజపతి రాజు చెప్పారు. గతేడాది మార్చిలో ఉడాన్ పథకం తొలిరౌండ్ బిడ్డింగ్ జరగ్గా మొత్తం 128 మార్గాలను అప్పట్లో ఈ పథకం కింద వివిధ విమానయాన సంస్థలకు కేటాయించడం విదితమే. తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు మార్గం విమానయాన సంస్థ హైదరాబాద్–హుబ్లీ టర్బో ఏవియేషన్, అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–కొల్హాపూర్ ఇండిగో, అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–నాసిక్ అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–షోలాపూర్ అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–కొప్పళ్ టర్బో ఏవియేషన్ తిరుపతి–కొల్హాపూర్ ఇండిగో తిరుపతి–హుబ్లీ ఘొడావత్ (హెలికాప్టర్లు) వివిధ కొత్త మార్గాల్లో ముఖ్యమైనవి దర్భంగా–బెంగళూరు; దర్భంగా–ఢిల్లీ; దర్భంగా–ముంబై; కార్గిల్–శ్రీనగర్ హుబ్లీ – అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, కన్నూర్ కన్నూర్ – బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, ముంబై, తిరువనంతపురం బికనీర్ – జైపూర్ జైసల్మేర్ – అహ్మదాబాద్, సూరత్, ఉదయ్‌పూర్ పాక్యాంగ్(సిక్కిం) – ఢిల్లీ, గువాహటి, కోల్‌కతా వెల్లూరు – బెంగళూరు, చెన్నై హెలికాప్టర్ ద్వారా.. ముఖ్యమార్గాలు కులు–మనాలి సిమ్లా–మండి మండి–ధర్మశాల మండి–సిమ్లా హరిద్వార్–హల్ద్వని జోషిమఠ్–గౌచర్ మసోరి–డెహ్రాడూన్ -
ఇక అంగన్‌వాడీలన్నీ మనవారికే!
♦ తిరుపతి మేధోమథన సదస్సులో సీఎం చంద్రబాబు ♦ ఆ మేరకు కలెక్టర్లకు సూచించానని వెల్లడి సాక్షి, హైదరాబాద్/ తిరుపతి: రాష్ర్టంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ సమయంలో టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ప్రారంభమైన టీడీపీ ఏపీ కమిటీ దిశా నిర్దేశ సదస్సు శనివారం ముగిసింది. రెండో రోజు జన చైతన్యయాత్రల సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు బృందాలుగా ఏర్పడి పలు సమస్యలపై చర్చించారు. వచ్చిన సూచనలపై చంద్రబాబు స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న అందరినీ తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, అలా కాకుండా ఇక ముందు నియమించే వారిలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ఇలాంటి అంశాలను ఇక ముందు ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించవద్దని నేతలకు సూచించారు. ఇప్పటికే వ్యవసాయ కమిటీలు, సాగునీటి సంఘాలతో సహా పలు కమిటీలను పార్టీ కార్యకర్తలతో భర్తీ చేసిన చంద్రబాబు ఇప్పుడు అంగన్వాడీలను కూడా పార్టీ వారితో భర్తీ చేస్తామని చెప్పడంపట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జన్మభూమి కమిటీలకే బాధ్యతలు జన్మభూమి కమిటీలను పటిష్టం చేసి ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలని చంద్రబాబు చెప్పారు. ఏటా 40వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ నిర్వహించే జనచైతన్య యాత్రలో పార్టీ యంత్రాంగం మొత్తం పాల్గొనాలని సూచించారు. నెలాఖరులోగా కమిటీ పదవుల భర్తీ.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల పదవులను నెలాఖరులోగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం పార్టీ ప్రతినిధులకు సూచించారు. ప్రతీ మూడు నెలలకోసారి మేధోమథన సదస్సు నిర్వహించి సమీక్షించుకుంటామని తెలి పారు. టీడీపీ ఏపీ కమిటీ అధ్యక్షుడు కె.కళావెంకట్రారావు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, కేంద్రమంత్రి ఆశోక గజపతిరాజు, తదితరులు సదస్సులో పాల్గొన్నారు. విద్యార్థులకు పురస్కారాల అందజేత సాక్షి, చిత్తూరు: విద్యార్థులను ప్రోత్సహించి, వారిలో స్ఫూర్తి నింపేందుకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోని తారకరామ స్డేడియంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.