తెరపై మెరిశాడు | bingi satyanarayana wins award | Sakshi
Sakshi News home page

తెరపై మెరిశాడు

Jun 16 2016 9:40 AM | Updated on Sep 4 2017 2:38 AM

ఆ యువకుడు పైసా ఖర్చు లేకుండా ఒక్క రోజులోనే మూడు షార్ట్‌ఫిల్మ్‌లను నిర్మించాడు..

దర్శకత్వశాఖలో రాణిస్తున్న సత్యనారాయణ
అక్షరం అనే లఘుచిత్రానికి అవార్డు
పలు సీరియల్స్‌కు అసోసియేటేడ్, కో డెరైక్టర్‌గా..

 
 
 భూదాన్‌పోచంపల్లి: ఆ యువకుడు పైసా ఖర్చు లేకుండా ఒక్క రోజులోనే మూడు షార్ట్‌ఫిల్మ్‌లను నిర్మించాడు.. ఎప్పటికైనా మంచి డెరైక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనే తపన.. ఇప్పటికే బుల్లితెరలో ఎన్నో ప్రముఖ సీరియల్స్‌కు అసోసియేటెడ్, కో డైరె క్టర్‌గా పనిచేశాడు.. అంతేకాదు పలు పత్రికలు, మేగజైన్లలో అనేక క థలు రాసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.. పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన బింగి సత్యనారాయణ..
 
బింగి సత్యనారాయణకు చిన్పప్పటి నుంచే కళలపై మక్కువ ఎక్కువ. గతంలో ఆలిండియా రేడియో, యువవాణి, వివిధ భారతి విభాగాలకు కవితలు, కథానికి స్వయంగా రాసి చదివేవాడు. అలాగే పలు పత్రికలు, మేగజైన్‌ల్లో ఇతని 80 కథలు వరకు ప్రచురితమయ్యాయి. అంతేకాక పిసినారి బావ, యమలోకంలో గందరగోళం, డాక్టర్ ఆగమయ్య అనే నాటకాలను వేశాడు. అదే స్ఫూర్తితో ప్రముఖ బుల్లితెర దర్శకురాలు మంజులానాయుడు వద్ద చక్రవాకం, డైలీ సీరియల్‌లో అసోసియేటెడ్ డైరక్టర్‌గా, శిశిర వసంతం, లక్ష్మీనివాసం సీరియల్స్‌కు కోడెరైక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రియాంక, పద్మవ్యూహం సీరియల్స్‌లో దర్శకత్వ శాఖలో పనిచేసి తనదైన ముద్రవేశాడు.
 
 సామాజిక ఇతివృత్త కోణంలో..
 నిర్మించే షార్ట్‌ఫిల్మ్‌లు సామాజిక ఇతివృత్తం ఇమిడి ఉంటుంది. అక్షరం, ప్రేమ నీ దారెటు?, యాసిడ్ తదితర షార్ట్‌ఫిల్మ్‌లు ఇదే కోవకు చెందినవి.
 
 ఒక్క రోజులో.. పైసా ఖర్చు లేకుండా..
 ఒక్క రోజులో పైసా ఖర్చులేకుండా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించడం ఇతడి ప్రత్యేకత. ఔత్సాహిక స్నేహితులందరూ కలిసి ఫ్రెండ్స్ మూవీస్ అనే బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు. టాలెంట్ కల్గిన స్థానిక ఆర్టిస్ట్‌లు, నటీనటులతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్, టెక్నిషియన్స్ ఇలా అన్నిశాఖలకు చెందిన వారు స్నేహితులంతా కలిసి పనిచేస్తారు. ఇప్పటి వరకు నిర్మించిన 3 షార్ట్‌ఫిల్మ్‌లు కూడా ఒక్కరోజులో తీసినవే. అంతేకాదు యాసిడ్ అనే షార్ట్‌ఫిల్మ్ కేవలం స్మార్ట్‌ఫోన్‌తో తీసి క్లారిటీ ఏ మాత్రం తగ్గకుండా ఔరా అనిపించుకున్నాడు. నిర్మాతలు ఎవరైనా ముందుకు వస్తే రూ.లక్ష లోపు సినిమాను నిర్మిస్తానని బింగి సత్యనారాయణ చెబుతున్నాడు. ఎన్నటికైన మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకోవాలని పేర్కొంటున్నాడు.
 
 ఉత్తమ అవార్డుకు ఎంపిక
 సత్యనారాయణ నిర్మించిన మొదటి షార్ట్‌ఫిల్మ్ అక్షరం షార్ట్‌ఫిల్మ్‌కు జాతీయస్థాయి అవార్డును అందుకున్నాడు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వీఆర్ ఫిల్మ్స్ నిర్వహించిన జాతీయస్థాయి షార్ట్‌ఫిల్మ్‌ల కాంటెస్ట్‌లో అక్షరం షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. కాగా ఈ కాంటెస్ట్‌కు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ తదితర భాషలకు చెందిన 250 షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శించారు. మాటలు లేకుండా, కేవలం నేపథ్యం సంగీతంతోనే ఓ అనాథకు చదువు పట్ల ఉండే ఆసక్తితో ఏ విధంగా ఓనమాలు నేర్చుకున్నాడు అనే కథను ఆసక్తికరంగా చిత్రీకరించాడు. ఆ అవార్డును వీఆర్ ఫిల్మ్స్ ఫౌండర్ వినయ్ చేతుల మీదుగా అందుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement