వేలం.. గందరగోళం | auction reaction | Sakshi
Sakshi News home page

వేలం.. గందరగోళం

Jun 29 2017 10:07 PM | Updated on Oct 1 2018 2:09 PM

వేలం.. గందరగోళం - Sakshi

వేలం.. గందరగోళం

శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సాగుభూముల కౌలు వేలం పాటలు గందరగోళం మధ్య ప్రారంభమై చివరకు ఆగిపోయాయి.

- నిలిచిపోయిన శ్రీమఠం సాగు భూముల వేలం పాటలు
- ఆలస్యంగా నిర్వహించడంపై రైతుల ఆగ్రహం
- వేలం పాడబోమంటూ వెనుదిరిగిన రైతులు 
- మౌనంగా ఉండిపోయిన అధికారులు
మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సాగుభూముల కౌలు వేలం పాటలు గందరగోళం మధ్య ప్రారంభమై చివరకు ఆగిపోయాయి. ఏప్రిల్‌, మే నెలలు కాకుండా ఆలస్యంగా భూములకు వేలం నిర్వహించడం, కొంతమందికి మాత్రమే అనుమతి లభించడంతో రైతులు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. వేలం పాటలు పాడేది లేదంటూ వాకౌట్‌ చేశారు. స్థానిక భూరమణ కల్యాణ మంటపంలో శ్రీమఠానికి చెందిన కల్లుదేవకుంట గ్రామ పరిధిలోని 199.94 ఎకరాల భూములకు గురువారం కౌలు వేలం పాటలు ప్రారంభించారు.
 
దేవాదాయశాఖ ఈఓ డీవీఆర్‌కే ప్రసాద్‌ పర్యవేక్షణలో వేలం పాటలు మొదలెట్టారు. 10.45గంటల వరకు రైతుల నుంచి దరావతు కింద రూ. 10వేల ప్రకారం స్వీకరించి వేలాలకు అనుమతించారు. అయితే సగానికి పైగా రైతులు ఆలస్యంగా రావడంతో అనుమతి లభించలేదు. అధికారులను వేడుకున్నా సమయం మించిపోయిందంటూ తోసిపుచ్చారు. దీంతో 36మంది రైతులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఆదిలోనే రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవేంద్రస్వామి మఠం పరిధిలో దాదాపు 1600 ఎకరాలుండగా 199.94 ఎకరాలకు మాత్రమే వేలాలు నిర్వహించడం ఏంటని రైతు మాధవరెడ్డి అధికారులను నిలదీశారు. ఏప్రిల్, మే నెలల్లో కాకుండా ఇంత ఆలస్యంగా వేలాలు నిర్వహిస్తే పంటలు పండించుకునేది ఎలా అంటూ కొందరు రైతులు ప్రశ్నించారు.
 
వేలం పాటలకు వచ్చే రైతులు చాలామంది ఉన్నారని, అందరినీ అనుమతించాలని మరి కొందరు... అధికారులను అడిగారు. అందుకు మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు ససేమిరా అనడంతో వేలం పాటలు పాడేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట నుంచి వాకౌట్‌ చేశారు. ఎస్‌ఐలు రాజారెడ్డి, శ్రీనివాసనాయక్‌ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు ఒంటిగంట వరకు కల్యాణమంటపంలోనే మౌనంగా ఉండిపోయారు. వేలం పాటల్లో శ్రీమఠం ల్యాండ్‌ సెక‌్షన్‌ ఆఫీసర్‌ వెంకటకృష్ణుడు, నకాతే శ్యాంప్రసాద్, డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్‌వర్మా, రిటైర్డ్‌ డీటీ ఉపేంద్రబాబు, పర్యవేక్షకులు దక్షణామూర్తి, వీఆర్‌ఓ భీమన్న పాల్గొన్నారు.
 
మొత్తం భూములకు వేలం నిర్వహించాలి ..
- మాధవరెడ్డి, కల్లుదేవకుంట
శ్రీమఠం పరిధిలో 1600 ఎకరాలుండగా 199.94 ఎకరాలకు మాత్రమే కౌలువేలం నిర్వహించడం సరికాదు. గతేడాది మఠం పరిధిలోని మొత్తం భూములకు వేలాలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే మా గ్రామ పరిధిలోని భూములకు మాత్రమే వేలాలు వేయడం పద్ధతికాదు. శ్రీమఠం అధికారులు ఇకనైనా మేల్కోవాలి. మొత్తం సాగు భూములకు కౌలు వేలం నిర్వహించాలి. 
 
అన్నింటికీ వేలాలు నిర్వహిస్తాం .. - మాధవశెట్టి, శ్రీమఠం ఏఏఓ
హైకోర్టు, దేవాదాయశాఖ డైరెక‌్షన్‌లో శ్రీమఠం పరిధిలోని మొత్తం భూములకు కౌలు వేలాలు నిర్వహిస్తాం. రెండు గ్రామాల్లో మినహ అన్ని గ్రామాలలోని భూములకు వేలాలు ముగిశాయి. అలాగే మఠం పరిధిలోని వ్యాపార దుకాణాలకు సైతం త్వరలో వేలాలు నిర్వహిస్తాం. ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు ఇచ్చాం. ఇందులో ఎలాంటి రాజకీయాలకు ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement