
ధైర్యంగా పోరాడండి...అండగా ఉంటాం: వైఎస్ జగన్
ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కాకినాడ : ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. యువభేరీలో పాల్గొనేందుకు కాకినాడ వెళుతున్న ఆయనను బుధవారం ఆరోగ్యమిత్ర ఉద్యోగులు బూరుగుపూడిలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఆరోగ్య మిత్ర ఉద్యోగుల వల్లే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ఏపీ సర్కార్ మర్చిపోతుందని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు సర్కార్ నిరుద్యోగుల పొట్టగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ధైర్యంగా పోరాడాలని, ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు తాము మద్దతుగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త నియామకాలకు అనుమతిస్తూ జీవో-28 ను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 13 జిల్లాల్లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.