మద్యం రగడ | Alcohol is continuing on the formation of liquor shops and bars | Sakshi
Sakshi News home page

మద్యం రగడ

Jun 30 2017 2:57 AM | Updated on Sep 5 2017 2:46 PM

మద్యం రగడ

మద్యం రగడ

జిల్లాలో మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై రగడ కొనసాగుతోంది. ప్రధాన రహదారుల వెంట మద్యం షాపులు నెలకొల్పి

నెల్లూరు : జిల్లాలో మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై రగడ కొనసాగుతోంది. ప్రధాన రహదారుల వెంట మద్యం షాపులు నెలకొల్పి రూ.కోట్లు గడించిన లిక్కర్‌ సిండకేట్ల ప్రతినిధులు వాటిని వేరేచోటుకు మార్చడానికి ససేమిరా అంటున్నారు. తమ పంతం నెగ్గించుకునేందుకు మంత్రుల ద్వారా పైరవీలు నడుపుతున్నారు. ఇదికాస్తా కొలిక్కి వచ్చినట్టే కనిపించినా.. అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో ప్రధాన రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను శనివారం నాటికి 500 మీటర్ల దూరానికి మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

సర్వత్రా ఉత్కంఠ
మద్యం దుకాణాల లైసెన్స్‌ కాల పరిమితి ముగియగా.. కొత్త లైసెన్స్‌లు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే దానిపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే జిల్లాలో 164 మద్యం షాపులు, 30 బార్లను తప్పనిసరిగా రోడ్లకు దూరంగా మార్చాల్సి వస్తుంది. జిల్లాలో మొత్తం 350 మద్యం షాపులు, 43 బార్లు ఉన్నాయి. వీటిద్వారా నెలకు సగటున రూ.95 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతలే లిక్కర్‌ సిండికేట్‌లో ప్రధానమైన వ్యక్తులుగా ఉంటున్నారు.

వాయిదా వేస్తూ..
రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను 500 మీటర్ల అవతలకు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. జూలై 1నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ క్రమంలోనే జాన్‌ చివరి వారంలో నిర్వహించాల్సిన మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపును మార్చి 31లోపే నిర్వహించి.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త లైసెన్స్‌లు కేటాయించింది. ఈ దృష్ట్యా శనివారం నుంచి మద్యం దుకాణాలను ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది.

అయితే, కోర్టు ఆదేశాల నుంచి తప్పించుకునే యత్నాల్లో భాగంగా సర్కారు చేయూతతో మద్యం సిండికేట్లు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర రహదారుల్ని ఢీనోటిఫై చేయించి.. వాటిని నగర, మున్సిపాలిటీ, పంచాయతీ రహదారులుగా మార్పిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదన్న ఉద్దేశంతో పైరవీలు సాగించాయి. మంత్రుల సాయంతో ఆ దిశగా కసరత్తు కూడా చేయిం చాయి. 20 రోజులుగా ఈ వ్యవహారం నానుతున్నా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులేవీ అందలేదు.

గందరగోళం
రోడ్ల ఢీ నోటిఫైకి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో షాపులు మార్చాలా లేక ఉన్నచోటే కొనసాగించాలనే అనే దానిపై గందరగోళం నెలకొంది. షాపులు మార్పు చేయకుండా ఉండేదుకు మద్యం సిండికేట్‌ సభ్యులు అన్ని షాపుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి పెద్దలకు మట్టజెప్పినట్టు సమాచారం. మార్పు తప్పనిసరి అయితే నెల్లూరు డివిజన్‌ పరిధిలో అత్యధికంగా 118 షాపులను మార్చాల్సి వస్తుంది. గూడూరు డివిజన్‌లో 66 షాపులు మార్చాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 30 బార్ల మార్పు అనివార్యం. మరోవైపు ఇళ్లమధ్య మద్యం దుకాణాలు పెట్టొద్దంటూ ప్రజలు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున అధికారులకు వినతులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల దుకాణాలు పెడితే నష్టపోతామనే అభిప్రాయం వ్యాపారుల్లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement