విమానయానానికి కొద్ది రోజులుగా మేఘాలు పగ్గాలు వేస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతూండడంతో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు
-
ప్రతికూల వాతావరణంతో విమాన ప్రయాణాలకు ఆటంకాలు
-
విజిబులిటీ సమస్యతో ఆలస్యమవుతున్న సర్వీసులు
-
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మధురపూడి :
విమానయానానికి కొద్ది రోజులుగా మేఘాలు పగ్గాలు వేస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతూండడంతో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు ల్యాండింగ్ అవ్వాలన్నా, టేకాఫ్ తీసుకోవాలన్నా పైలట్‌కు రన్‌వే విజిబిలిటీ (దూరంగా ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం) బావుండాలి. లేకుంటే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కొన్నాళ్లుగా వర్షాలు కురుస్తూండడం, ఆకాశం తరచూ మేఘావృతమై, విజిబిలిటీ సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు పొగమంచు వాతావరణం ఏర్పడి, విజిబిలిటీ మరింత పడిపోతోంది. తరచూ విమానాలు జాప్యం కావడమో లేక రద్దవడమో జరుగుతూండడంతో విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి తగ్గింది.
రోజూ 6 సర్వీసులు
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్ సంస్థలకు చెందిన 6 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ట్రూజెట్ మొదటి సర్వీసుతో మొదలై, సాయంత్రం 4.30 గంటలకు వీటి రాకపోకలు ముగుస్తున్నాయి. వీటిలో సుమారు 700 మంది ప్రయాణాలు సాగిస్తారు. మామూలు రోజుల్లో ఒక్కో విమానానికి 55 నుంచి 70 మంది ప్రయాణిస్తుంటారు. దీంతో టెర్మినల్ భవనం సందడిగా ఉంటుంది. కానీ, కొన్నాళ్లుగా వర్షాలు కురుస్తూండడంతో విమానాలు సరిగా రాకపోవడంతో ప్రయాణికుల సంఖ్య 40 నుంచి 50 మధ్యకు పడిపోయింది. తరచుగా ఏదో ఒక విమానం సాంకేతిక కారణాలతో రద్దవుతోంది. మరోపక్క ప్రతికూల వాతావరణంతో దాదాపు ప్రతి రోజూ విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి.
రన్‌వే పూర్తయితే..
ప్రస్తుత వర్షాలవలన విమానాల రాకపోకలకు పెద్దగా ఆటంకాలుండవు. రన్‌వే విస్తరణ పనులు పూర్తయితే ల్యాండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. విమాన ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి.
- ఎం.రాజ్‌కిషోర్, డైరెక్టర్, రాజమహేంద్రవరం విమానాశ్రయం