ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు కొరికి శిశువు మరణించినా.. బాలింతల వార్డులో పంది కొక్కులు తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఉండడం లేదు.
హడలిపోయిన రోగులు, వైద్యసిబ్బంది
గుంటూరు మెడికల్: ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు కొరికి శిశువు మరణించినా.. బాలింతల వార్డులో పంది కొక్కులు తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఉండడం లేదు. తాజాగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గురువారం మళ్లీ పాము ప్రత్యక్షం అవడంతో వైద్య సిబ్బంది, రోగులు హడలెత్తిపోయారు. ఆర్థోపెడిక్ వైద్యవిభాగంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సు అన్నపూర్ణ బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు తలుపు తెరవగా లోపల పాము కనిపించింది.
ఆమె శానిటేషన్ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు బాత్‌రూము గదిలో ఉన్న పామును చంపి బయటపడేశారు. ఆగస్టులో ఇదే వార్డులోని ఆపరేషన్ థియేటర్‌లో పాము కనిపించింది. ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన కూడా ఆగస్టులోనే జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్న ఎస్-1 వార్డులోనే మంగళవారం(డిసెంబరు 29వ తేదీ) కట్లపాము ప్రత్యక్షం అయింది. ఆసుపత్రి సిబ్బంది సమాచారాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేసి గోప్యంగా ఉంచారు.