ఉద్యమ పాటకు గుర్తింపు

ఉద్యమ పాటకు గుర్తింపు


రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యమ గేయ రచయితలుగా అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస్‌

సాక్షి, యాదాద్రి/మోత్కూరు (తుంగతుర్తి) :  తెలం గాణ ఉద్యమ పాటకు గుర్తింపు లభించింది. మోత్కూ రు మండల కేంద్రానికి చెందిన అభినయ శ్రీనివాస్, గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన కోదారి శ్రీనును రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యమ గేయ రచయితగా ప్రభుత్వం ఎంపిక చేసింది. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కారాన్ని సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా వీరు అందుకోనున్నారు.అభినయ శ్రీనివాస్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు స్వగ్రామం. తల్లిదండ్రులు నర్సమ్మ, బ్రహ్మచారి కార్పంటర్‌ పనులు చేసేవారు. ఎంఏ, బీఈడీ చేసిన ఆయన 1989లో మోత్కూరులో ‘అభినయ కళా సమితి’ని స్థాపించారు. నాటి నుంచి సినిమా పాటలతోనే కాదు.. ఉద్యమాల పాటలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు.  తాను స్థాపిం చిన సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తం గా 200 ప్రదర్శనలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ గేయాలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించారు. ప్రస్తుతం రచయితగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నాడు.  ఇప్పటి వరకు 50 సినిమాల్లో సుమారుగా 150 పాటలు రాశాడు.సమితి పేరే ఇంటి పేరుగా..

అభినయ కళా సమితి స్థాపించగా ఆయన ఇంటి పేరు అభినయగా మారింది. స్థానిక ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం జరిగింది. 1992లో పదో తరగతిలో మోత్కూరు పాత తాలూకా పరిధిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు.  శ్రీనివాస్‌ గేయాలు రాసిన సినిమాలివే

నవవసంతం, విజయదశమి, సవాల్, దొంగలబండి, గోరింటాకు, అధినేత, వెంకటాద్రి, పున్నమి నాగు, సమర్థుడు, భీమిలి కబడ్డీ జట్టు, మంచివాడు, సేవకుడు, రామదండు, మహర్షి, వీరా, యమలోకంలో జై తెలంగాణ సినిమాలకు పాటలు రాశారు. అంతేకాకుండా ‘‘శరణాంజలి’’ అయ్యప్ప భక్తి గీతాలు, తెలంగాణ సంగతులు, ఆఖరిమోఖ, ఉద్యమ గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి.గోరింటాకు సినిమాలో...

‘‘అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మలా సంబంధం

జాబిలమ్మకు జన్మదినం కోటి తారకల కోలాహలం

అన్నయ్య దిద్దిన వర్ణాలన్నీ అర చేతిలోనా హరివిల్లై..

గోరింట పండగా... మా ఇంట పండుగ’’

తెలంగాణ ఉద్యమంలో...

‘‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా

కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా

వీర తెలంగాణమా.. నాలుగు కోట్ల ప్రాణమా’’

సారథి గీతాల్లో..

మొక్కలు నాటే యజ్ఞం మొదలైయ్యింది.

హరితతెలంగాణ నేల పులకరించింది.

ఆకుపచ్చ పొద్దుపొడిచి ఆకారం మురిసింది

కళ్యాణలక్ష్మి పథకంలో..

పేదింటిపెల్లికి పెద్ద దిక్కు సర్కారు

సందామామ ఓలా సందామా..

తెలంగాణ యాసను పాటగా మలిచి..ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన కోదారి శ్రీనివాస్‌ ఉద్యమ గాన విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్‌ రెండో తేదీన శ్రీనివాస్‌కు రూ.1,00116 నగదుతోపాటు శాలువా, మెమొంటోను అందజేస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యాస, భాషలో వలస విధానాలు, దుఃఖాలను తన పాటలుగా మలిచానని చెప్పారు. అలాగే ఉద్యమంలో 360 పాటలు రాశానని, ‘అసైదుల్లా హారతి, ముద్దుల రాజన్న, బొంబాయిపోతున్న’ వంటి పాటలు ఉద్యమానికి ఎంతో ఉపకరించాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ తెలంగాణ జాగృతిలో సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా బతుకమ్మ పాటలు ఎన్నో రూపొందించారు. అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top