‘అంత్య’ శోభితం | 2nd day godavari pushker is joyfull | Sakshi
Sakshi News home page

‘అంత్య’ శోభితం

Aug 1 2016 10:24 PM | Updated on Sep 4 2017 7:22 AM

గోదావరి అంత్యపుష్కరాల్లో రెండో రోజు సోమవారం భక్తుల సందడి

గోదావరి అంత్యపుష్కరాల్లో రెండో రోజు సోమవారం భక్తుల సందడి

గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కూడా భక్తుల సందడి కొనసాగింది. భద్రాచలంలో సుమారు 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయ దర్శనం, పుష్కరస్నానం చేసుకునే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు.

  •  భద్రాచలం తరలివస్తున్న భక్తులు
  • రెండో రోజు 20వేల మంది స్నానాలు

  • అంత్య పుష్కర శోభితంగా గోదావరి తీరం.. 20వేల మందికి పైగా పుణ్యస్నానం.. రెండోరోజు సోమవారం కూడా పుష్కరాలకు భక్తులు భారీగానే తరలివచ్చారు. పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను గౌతమి మాతకు సమర్పించారు. నదిలో దీపాలు వదిలి.. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. ముల్తైదువుల వాయినాలు.. బంధుమిత్రుల కోలాహలం.. భక్తజనంతో గోదావరి తీరం పులకించింది.             

    భద్రాచలం :
        గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కూడా భక్తుల సందడి కొనసాగింది. భద్రాచలంలో సుమారు 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయ దర్శనం, పుష్కరస్నానం చేసుకునే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గోదావరి స్నానఘట్టాల రేవులో సందడి కనిపించింది. గౌతమి తీరానికి చేరుకున్న భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి, గోదారమ్మకు పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను సమర్పించారు. మెట్ల రేవులో తులసి మొక్కలను ఏర్పాటు చేసి, పూజలు చేసి, దీపాలు వెలిగించి.. వాటిని భక్తి శ్రద్ధలతో గోదావరిలో వదిలారు. కృష్ణా పుష్కరాలకు ముందు వచ్చిన గోదావరి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. గోదావరిలో నీరు నిండుగా ఉండటంతో పిల్లలు, పెద్దలు ఆహ్లాద వాతావరణంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానం పూర్తయిన తరువాత పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామివారికి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించి రామాలయాన్ని దర్శించుకున్నారు.

    •  రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్ధసారథి కుటుంబ సమేతంగా గోదావరిలో పుష్కరస్నానం చేశారు. గోదావరి ఒడ్డున పూజలు నిర్వహించి నదిలో దీపాలు వదిలారు.

    ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన
    అంత్య పుష్కరాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారికి సహస్ర నామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు  ఆలయ ప్రాంగణంలో వేడుక అత్యంత వైభవంగా సాగింది. క్షేత్రమహాత్మ్యంపై ఆలయ వేదపండితులు ప్రవచనాలిచ్చారు. స్వామివారికి నిత్యకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దేవస్థానం వేదపండితులు, అర్చకులు ఊరేగింపుగా గోదావరి తీరానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రభుత్వ సేవ జరిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement