ఆలోచించండి..!

Young people who commit crimes for the jalsas - Sakshi

భుజానికి బ్యాగు.. చేతిలో మొబైల్‌ పట్టుకుని అమ్మాయి కాలేజికి బయలుదేరుతుంటే కన్నవారు తమ బిడ్డ గొప్ప చదువులు చదివేందుకు వెళుతోందని మురిసిపోతుంటారు.. భుజానికి బ్యాగు.. చేతిలో బైకు.. మరో చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకుని అబ్బాయి రయ్‌మని దూసుకుపోతుంటే తమ కొడుకు ఉన్నతస్థాయికి చేరుకుంటాడని ఆ తల్లిదండ్రులు సంబరపడుతుంటారు.. ఇదీ నేటి సమాజంలో నిత్యం మనకు కనిపిస్తున్న దృశ్యం.. చాలామంది యువత కాలేజీకి ఎగనామం పెట్టి తోటి విద్యార్థులతో స్నేహం.. ప్రేమ పేరుతో షికార్లు చేస్తూ.. తమ విలువైన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.. ఇలాంటి దుశ్చర్యలకు చరమగీతం పాడాలంటే.. ఓ వైపు తల్లిదండ్రులు.. మరో వైపు కాలేజీ యాజమాన్యాలు.. ఇంకోవైపు పోలీసులు.. యువత..సమాజం.. ఎవరంతట వారు ఆలోచించాలి. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఎవరి వంతు కృషి వారు చేయాలి.

కడప అర్బన్‌ : ఇటీవల కాలంలో విద్యార్థినులపై అత్యాచారాలు.. దౌర్జన్యాలు.. పెరిగిపోతున్నాయి. తను ప్రేమించిన వ్యక్తి అని నమ్మి అతని వెంట వెళ్లి చివరకు శవమై తేలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. యువతీ,యువకులు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై పార్కులు, రిసార్ట్స్, కేఫ్‌లు, హోటళ్లకు, సినిమాలకు, షికార్లు కొడుతూ ఉజ్వల భవిష్యత్తును తమ చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకున్నామని గ్రహించేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ అవమనాన్ని భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే విషయాన్ని కూడా గ్రహించలేక తీవ్ర ఆవేదనతో కాలం వెళ్లదీస్తున్నారు.  

ప్రేమపేరుతో అమ్మాయిలకు తప్పని వంచన  
అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చదివించే తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న ప్రేమ.. మమకారం.. గారాబం కారణంగా వారికి విపరీతమైన స్వేచ్ఛ ఇస్తున్నారు. వారి కదలికలపై ఏమాత్రం దృష్టి సారించడంలేదు. పర్యవసానంగా ప్రేమ పేరుతో తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తాము ప్రేమించిన యువకునితో కలిసి ద్విచక్రవాహనాలు, కార్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వెనుకాడటం లేదు. తమ అమ్మాయికి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవసరమని భావించి  తల్లిదండ్రులు వేలాది రూపాయలు వెచ్చించి సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేయించి ఇస్తే, వాటితో చాటింగ్‌ చేస్తూ చివరకు చీటింగ్‌కు గురవుతున్నారు.  

ఎవరి బాధ్యత ఎంతెంత ?
► యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారంటే వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరి బాధ్యత ఎంతెంత అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, పోలీసులు కూడా చాలా సందర్భలాలలో బాధ్యత వహించాల్సి వస్తోంది.
►తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ.. అనురాగాన్ని చూపించాల్సిందే. అయితే ఒక్కడే కుమారుడు, ఒక్కతే కుమార్తె అంటూ వారికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వడం, అవసరానికి మించి డబ్బులు ఇవ్వడం చెప్పకనే తమ పిల్లల జీవితాలు నాశనం అయ్యేందుకు వారే కారణమవుతున్నారు.
►విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ లాంటి చర్యలను చూసీచూడనట్లు వదిలేసినా, పర్యవేక్షణ సరిగా లేకపోయినా విద్యార్థులు గతి తప్పుతారు.
►పోలీసులు తమ పరిధిలోని విద్యాసంస్థల్లో ప్రేమ వ్యవహారం, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి.  

జల్సాల కోసం నేరాలకు పాల్పడుతున్న యువకులు
యువతులను తమ వైపు ఆకర్షించుకునేందుకు, వారికి ఖరీదైన గిఫ్ట్‌లను ఇచ్చేందుకు, తాము జల్సాగా తిరిగేందుకు కావాల్సిన డబ్బుల కోసం కొందరు యువకులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. మొదట తనను నమ్మి వచ్చిన యువతి కోసం ప్రేమ పేరుతో ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్దమవుతాడు. జల్సాలకు డబ్బులు అవసరమైన సందర్భాల్లో నేరాలకు పాల్పడి పోలీస్‌ స్టేషన్‌ల మెట్లెక్కుతున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, గ్యాంగ్‌ల ఏర్పాటు, దొంగతనాలు, దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. కటకటాల పాలవుతూ తమను నమ్మి వచ్చిన అమ్మాయిలను సైతం అడ్డంగా మోసగిస్తున్నారు.  

విద్యా సంస్థల్లో విస్తృత ప్రచారం అవసరం  
ప్రేమ వ్యవహారంలో ఆకర్షణ తప్ప,  ఉన్నత శిఖరాలు అధిరోహించే దిశగా ముందుకు వెళ్లడం చాలా అరుదుగా ఉంటుందనే విషయాలను, ప్రేమ వల్ల లాభ,నష్టాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. సదస్సులు, సమావేశాల ద్వారా యువతీ, యువకుల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలి. విద్యాసంస్థలు, హాస్టళ్ల వద్ద ఆయా యాజమాన్యాల పర్యవేక్షణ అవసరం. ఈవ్‌టీజింగ్, వేధింపులపై పోలీసుల నిఘా ఉండేందుకు తమ వంతు కృషి చేయాలి.

ప్రేమ జంటలకు జిల్లా పోలీసుల కౌన్సెలింగ్‌ ‘మంత్రాంగం’  
జిల్లా పోలీసు యంత్రాంగం పరివర్తన, ఎల్‌హెచ్‌ఎంఎస్, ఈ–చలాన్‌లపై విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇటీవల కొంతమంది ప్రేమ జంటలకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప నగర శివార్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈప్రక్రియ కొనసాగుతోంది.

యువతకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేస్తున్నాం
యువత ప్రేమ పేరుతో విచ్చల విడిగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.  బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతీ, యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. యువత జంటలు, జంటలుగా పార్కులు, శిల్పారామం లాంటి ప్రదేశాల్లో   జుగుప్సాకర చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నాం. – షేక్‌ మాసుం బాషా, కడప డీఎస్పీ

అన్నిరకాల పర్యవేక్షణ అవసరం
తల్లిదండ్రులు, అధ్యాపకులు, పోలీసుల పర్యవేక్షణ ఎంతైనా అవసరం. ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నారో పర్యవేక్షించి పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్కులు తదితర పర్యాటక ప్రదేశాలకు వచ్చేవారి వివరాలను నమోదు చేసేలా రికార్డును నిర్వహిస్తే అక్కడకి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వచ్చేవారు తగ్గిపోతారు. అలాగే  కళాశాల ఆవరణంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు.  – డాక్టర్‌ వెంకటేశ్వర్లు, కడప రిమ్స్‌ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top