మాస్కు వివాదం.. యువకుడి బలి

Young Man Deceased with Police Attack about Mask - Sakshi

పోలీసుల దాడిలో చనిపోయాడంటున్న బంధువులు

మద్యం మత్తులో వాహనం నుంచి దూకాడంటున్న పోలీసులు

చీరాల ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా

మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఎస్‌ఐపై వేటు

చీరాల: మాస్కు వివాదానికి ఓ యువకుడు బలైన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా,  మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్‌ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... చీరాలలోని థామస్‌పేటకు చెందిన ఎరిచర్ల మోహన్‌రావు, హెప్సీబాల కుమారుడు కిరణ్‌కుమార్‌ (26), స్నేహితుడు షైనీఅబ్రహాంతో కలిసి ఈనెల 19వ తేదీన తన పల్సర్‌ వాహనంపై వెళుతుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న  ఔట్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా, వారు వాగ్వావాదానికి దిగారు.

ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వారిని పోలీస్‌ జీపులో తరలిస్తుండగా, మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు దాడి చేశారని పేర్కొంటూ కిరణ్, షైనీలు ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్‌ను అదే రోజు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రాణాలు కోల్పోయిన కిరణ్‌ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు. దాడికి కారణమైన ఎస్‌ఐని విధుల నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

► ఆ ఇద్దరు యువకులు అధిక మద్యం తాగి పోలీసులతో గొడవ పడ్డారని, వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా కిరణ్‌ వాహనం నుంచి కిందకు దూకడంతో తలకు గాయాలై మృతి చెందాడని చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.
► ఈ కేసును విచారించేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఏఎస్పీని విచారణాధికారిగా నియమించారు. చీరాల ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ వేటు వేశారు. విజయ్‌కుమార్‌ను వీఆర్‌కు పంపించారు.  

స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ 
► ఈ విషయమై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top