ఎయిర్‌పోర్టులో యువకుడి ఆత్మహత్య

Young Man Commits Suicide in East Godavari - Sakshi

చెట్టుకు ఉరి వేసుకుని మృతి

మృతిపై పలు అనుమానాలు

తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం): రాజమహేంద్రవరం విమానాశ్రయం  సివిల్స్‌ విభాగంలో పని చేస్తున్న బండి రామకృష్ణ (25) చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోరుకొండ మండలం గుమ్ములూరుకు చెందిన బండి రామకృష్ణ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా ఇంటికి వెళ్లకపోవడంతో అధికారులు, బంధువులు ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు. వికలాంగుడైన రామకృష్ణ ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చనే అనుమానంతో అక్కడ పనిచేసే కార్మికులతో అధికారులు వెతికించారు. ఎయిర్‌పోర్టు కార్‌ పార్కింగ్‌ నూతన షెడ్‌ వెనుక వైపు ఉన్న చెట్ల పొదల్లో వేపచెట్టుకు ఉరివేసుకుని ఉన్న రామకృష్ణను మేకల శ్రీను తదితరులు గుర్తించారు. విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు ఎయిర్‌పోర్టు పోలీసులకు తెలిపారు. కోరుకొండ ఎస్సై శివాజీ సిబ్బందితోపాటు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఉద్యోగులు, బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై శివాజీ తెలిపారు.

మృతిపై పలు అనుమానాలు
రామకృష్ణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నగా ఉండే వేపచెట్టు కొమ్మకు అతడి మృతదేహం వేలాడుతుండడం చూసిన వారందరూ ఇది ఆత్మహత్య కాదని, హత్య అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు ఉద్యోగం నిమిత్తం వస్తున్న రామకృష్ణకు, అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి ఘర్షణ జరిగిందని, ఆ సంఘటనలో ఆ యువకుడు రామకృష్ణను కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్టు ఎస్సై ఏసురత్నం, ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఉన్నారు.

ఇలాంటి సంఘటనపై దిగ్భ్రాంతి
బండి రామకృష్ణ మృతిపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు ఆవరణలో జరిగిన మొదటి కేసు కావడం, రామకృష్ణ దివ్యాంగుడు కావడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top