జ్వరమొచ్చిందని వెళ్తే..

Wrong Reports in Private Hospital in West Godavari - Sakshi

వైద్యుడి కమీషన్ల కక్కుర్తి తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్‌

20 గంటల్లో మారిపోయిన నివేదికలు

డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేసిన బాధితుడు

అయినా పట్టించుకోని జిల్లా వైద్య ఉన్నతాధికారి

వైద్యుల కమీషన్ల కక్కుర్తి.. డయోగ్నోసిస్‌ సెంటర్ల తప్పుడు రిపోర్టులు రోగులనుఅప్పులపాలు చేయడంతో పాటు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కుమార్తెకు జ్వరంగా ఉందని వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన ఓ తండ్రికి తణుకులో చేదు అనుభవం ఎదురైంది. కమీషన్‌ కోసం వైద్యుడు ఎడాపెడా వైద్య పరీక్షలు రాయగా.. ల్యాబ్‌ నిర్వాహకులు తప్పుడు రిపోర్టు ఇచ్చారు. దీనిపై బాధితుడు డీఎంహెచ్‌ఓను ఆశ్రయించాడు.  

పశ్చిమగోదావరి, తణుకు అర్బన్‌: తణుకు పట్టణంలో ప్రైవేట్‌ వైద్యం మరోసారి వివాదాస్పదమైంది. కమీషన్ల కోసం ఓ వైద్యుడు వివిధ రకాల పరీక్షలు రాయగా డయాగ్నోసిస్‌ నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. ఆ రిపోర్టులను ఆసరాగా వైద్యుడు మరిన్ని పరీక్షలు చేయించాలంటూ చాంతాడంత జాబితా రాసిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకులో నివాసముంటున్న పీవీఎస్‌ రాధాకృష్ణ 19 సంవత్సరాల తన కుమార్తెకు జ్వరం వచ్చి తగ్గడం లేదనే ఉద్దేశంతో పట్టణంలో పాత పోస్టాఫీస్‌ సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి గతనెల 16న తీసుకువెళ్లారు.

వెంటనే వైద్యుడు వైద్యపరీక్షలు రాసి ఇచ్చారు. రాధాకృష్ణ తన కుమార్తెను పట్టణంలోని ప్రముఖ డయాగ్నోసిస్‌ సెంటర్‌లో వైద్యపరీక్షల్లో భాగంగా రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలకు రూ.1,720 బిల్లు కట్టారు. రిపోర్టుల్లో హిమోగ్లోబిన్‌ 9 గ్రాములు, రక్తంలోని వైట్‌ సెల్స్‌ కౌంట్‌ 47,000 ఉన్నట్లుగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ రిపోర్టులు చూసిన వైద్యుడు వెంటనే చాంతాడంత ట్రీట్‌మెంట్‌ రాయడంతో పాటు ఎమర్జన్సీగా ఆసుపత్రిలో జాయిన్‌ చేయాలని, స్కానింగ్‌ తదితర పరీక్షలు చేయాలని హడావుడి చేశాడు. దీంతో కంగారుపడిన సదరు తండ్రి మిత్రుడి సూచనల మేరకు మరొక వైద్యుడిని ఆశ్రయించారు.

అదే ల్యాబ్‌లో మళ్లీ పరీక్షలు
రిపోర్టుల్లో తేడా వచ్చిన పరీక్షలను మళ్లీ అదే డయోగ్నోసిస్‌ సెంటర్‌కు వైద్య పరీక్షలకు పంపించారు. 20 గంటల వ్యవధిలో రెండోసారి చేయించిన పరీక్షల్లో రిపోర్టు నార్మల్‌గా చూపించగా హిమోగ్లోబిన్‌ 10.9 గ్రాములు రాగా వైట్‌సెల్స్‌ కౌంట్‌ 10,700లుగా రిపోర్టు ఇచ్చారు. దీంతో రెండో వైద్యుడు జ్వరానికి మందుబిళ్ల వేసుకుంటే సరిపోతుందని ఏ విధమైన చికిత్స అవసరంలేదని తేల్చారు.

డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు
ముందు వైద్యుడు రాసిన విధంగా చికిత్స చేయించుకుంటే డబ్బు మాట పక్కనపెట్టినా తన కుమార్తెకు అవసరం లేని వైద్యం చేయడం వల్ల ఏ అనర్థం వచ్చేదోనని బెంబేలెత్తిపోయారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడిని, డయోగ్నోసిస్‌ సెంటర్‌ ప్రతినిధులను ప్రశ్నించినా పట్టించుకోపోగా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో గత నెల 18న డీఎంహెచ్‌ఓ, ఏలూరు వారికి తణుకుకు చెందిన వైద్యుడు, డయోగ్నోసిస్‌ సెంటర్‌పై ఫిర్యాదు చేశారు. తపాలా ద్వారా రిజిస్టర్‌ పోస్టు చేసిన తన ఫిర్యాదు వైద్యాధికారికి అందినప్పటికీ ఇంతవరకు ఎటువంటి విచారణ చేయలేదని బాధితుడు రామకృష్ణ ఆరోపిస్తున్నారు.

రిపోర్టుల్లో అంత తేడానా?
జ్వరంగా ఉందని తీసుకువెళ్లిన నా కుమార్తె నాడి పరీక్షించలేదు. కనీసం స్టెత్‌తో కూడా పరీక్ష చేయకుండా ఒకేసారి ఏకంగా రూ.1,720 విలువైన రక్తపరీక్షలు చేయించారు. పరీక్షల్లో కమీషన్లు తప్ప ముందుగా రోగి స్థితి తెలుసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఒకే డయాగ్నోసిస్‌ సెంటర్‌లో 20 గంటల్లో రిపోర్టులు ఎందుకు తేడా వస్తాయి? ఆసుపత్రి, డయోగ్నోసిస్‌ సెంటర్‌ రెండింటిపై ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు విచారణ చేపట్టకపోవడం దారుణం.– పీవీఎస్‌ రాధాకృష్ణ, తణుకు

విచారణకు ఆదేశించాం
తణుకులో ఒక ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు, ఒక డయోగ్నోసిస్‌ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదుపై ఒక మెడికల్‌ ఆఫీసర్‌ను విచారణ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాను. విచారణలో తప్పులు ధ్రువీకరణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి,డీఎంహెచ్‌ఓ, ఏలూరు  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top