పొట్టకూటి కోసం వెళ్లి..

Workers Died in Bike Accident PSR Nellore - Sakshi

బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

ఇద్దరు వ్యక్తుల దుర్మరణం  

కోవూరులో చోటుచేసుకున్న ఘటన  

నెల్లూరు, కోవూరు: వారిద్దరూ పొట్టకూటి కోసం ఉదయం నెల్లూరు నగరానికి వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఇంతలో రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

బేల్దారి పనికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు బేల్దారి కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కోవూరు లారీ యార్డ్‌ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దగదర్తి మండలంలోని అనంతవరం లైన్స్‌నగర్‌కు చెందిన పరశు వెంకటేశ్వర్లు (41), చంద్రమౌళి (40) బేల్దారి కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరూ పనినిమిత్తం నెల్లూరుకు వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోవూరు లారీ యార్డ్‌ సమీపంలో జాతీయ రహదారిపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఢీకొట్టిన వాహనం వారిపై నుంచి వెళ్లింది. హెల్మ్‌ట్‌లు ధరించి ఉన్నా వాహనం వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు పరశు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి, కోవూరు సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు, ట్రైనీ ఎస్సై అనూషలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top