పుకార్లు.. షికార్లు అంటుండగానే కనిపించిన దొంగలు | Women Parthi Gang Arrest In YSR Kadapa | Sakshi
Sakshi News home page

మళ్లీ అలజడి

Jun 6 2018 12:28 PM | Updated on Aug 20 2018 4:27 PM

Women Parthi Gang Arrest In YSR Kadapa - Sakshi

రాజంపేటలో అరెస్టయిన పార్థీ గ్యాంగ్‌ సభ్యుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

సాక్షి, కడప : మహారాష్ట్ర ప్రాంతంలో కరుడుగట్టిన.. పేరు మోసిన పార్థీ గ్యాంగ్‌ దొంగల పేరెత్తితేనే ఒకింత భయాందోళన.. దాదాపు రెండు నెలలుగా జిల్లాలోని అనేక పల్లెల్లో గ్యాంగుల భయంతో పహారా కాస్తున్న పరిస్థితి.. ఏ గ్యాంగ్‌ పేరేత్తితే జనాలు భయపడుతున్నారో అదే గ్యాంగ్‌కు చెందిన ముఠా సభ్యులు దొరకడంతో అది ప్రచారం కాదు.. వాస్తవం అన్న విషయాన్ని తెలుసుకుని ప్రజల్లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. సోషల్‌ మీడియాలో పార్థి గ్యాంగ్‌పై విస్తృత ప్రచారం జరగడంతో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అదే స్థాయిలో ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో సభలు పెట్టి ప్రజలకు ధైర్యం నూరిపోశారు. అయినా చివరిలో రాజంపేట ప్రాంతంలో సంచరిస్తున్న పార్థి గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

జిల్లాలో ఇంకా ఉన్నారా?
మహారాష్ట్రకు చెందిన పార్థిగ్యాంగులోని కొంతమంది సికింద్రాబాద్‌లోని లాలాగూడా ఏరియాలో నివసిస్తూ దొంగతనాలకు పక్కా స్కెచ్‌లు వేస్తున్నారు. రాజంపేటలో రెండు రోజుల క్రితం అదే గ్యాంగుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరిద్దరూ రాజంపేటలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. అయితే రాజంపేటలో దొరికిన వీరిద్దరి వెనుక ఎంతమంది ఉన్నారు? లేక వీరిద్దరే దొంగతనాలకోసం ఇక్కడికి వచ్చారా? ఎలాగూ పార్థిగ్యాంగ్‌ అని పోలీసులు నిగ్గు తేల్చడంతో మగవాళ్లతో కూడిన గ్యాంగ్‌ జిల్లాలో తిరుగుతోందా? అసలు ఎంతమంది ఉన్నారు.. ఉంటే వీరి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు.. తదితర విషయాలపై లోతుగా దర్యాప్తు జరిపి వాస్తవాలను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా పార్థిగ్యాంగ్‌ అంటేనే ఉలిక్కిపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయడం అవసరం.   రాజంటలోనే కాకుండా ఇటీవల అదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై కూడా పరిశీలన చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

చిక్కు వెంట్రుకలు..స్టీల్‌ సామాన్ల పేరుతో రెక్కీ..
జిల్లాలో పగటిపూట చిక్కు వెంట్రుకలు కొనుగోలు చేస్తూ.., స్టీల్‌ సామాన్లు విక్రయించే వారిలాగా వీరు తిరుగుతుంటారని పోలీసులు వెల్లడించారు. అలా తిరిగే సమయంలోనే తాళం వేసిన ఇళ్లను గుర్తించి అదేరోజు రాత్రి దొంగతనానికి పాల్పడతారు. ఒక వేళ వీరు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఎవరైనా ఉండి తిరగబడితే వారిని కర్కోటకంగా చంపేందుకు కూడా వీరు వెనుకాడరని తెలుస్తోంది. వీరివద్ద పెద్దకత్తి.. తపంచా కూడా ఉంటుందని సమాచారం. వీరి కుటుంబాల్లో మహిళలు, పిల్లలు కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మహిళలు రెక్కీ నిర్వహించి వారి మగవాళ్లకు సమాచారం చేరవేస్తే వారు ప్లాన్‌ అమలు చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో మహిళలు, పిల్లలు కూడా దొంగతనాలకు పాల్పడుతుంటారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారం పేరుతో అలా వచ్చిన వారిపై దాడులు చేయకుండా అనుమానం వస్తే డయల్‌ 100కు సమాచారం అందించినా నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతారని స్పష్టం చేస్తున్నారు.

మళ్లీ సోషల్‌ మీడియాలో...
జిల్లాలో పార్థీ గ్యాగ్‌ కదలికలు బయటపడటంతో సోషల్‌ మీడియాలో మళ్లీ ప్రచారం జోరందుకుంది. రాజంపేటలో గ్యాంగ్‌ వ్యవహారం వెలుగుచూడటంతో ప్రతి ఒక్కరు పార్థీ గ్యాంగ్‌ గురించి చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు స్పందించి మిగిలిన ముఠా సభ్యులను కూడా అరెస్టు చేసి వారి ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement