హత్య చేసి.. కాల్చేశారు | Women Brutal Murder In East Godavari | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. కాల్చేశారు

Jun 2 2019 11:50 AM | Updated on Jun 2 2019 11:50 AM

Women Brutal Murder In East Godavari - Sakshi

సంఘటన స్థలంలో వివాహిత మృతదేహం

పట్టణ శివార్లలోని పంట పొలాల్లో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తలపై తీవ్ర గాయం చేసి హత్య చేసిన అగంతకులు ఆమెను కాల్చి బూడిద చేసేందుకు ప్రయత్నించారు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి ముందస్తు పథకం ప్రకారం ఈ హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

మండపేట: మండపేట – ఆలమూరు రోడ్డు గొడ్డు కాలువ సమీపంలోని పుంత రోడ్డు దారిలో వివాహిత హత్య ఉదంతం పట్టణంలో సంచలనం సృష్టించింది. పొలాల్లో మృతదేహం భాగాలు ఉన్నట్టుగా స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై రాజేష్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం తల, చేతులు, కాళ్లు మినహా మిగిలిన శరీరమంతా కాలి బూడిదైంది. కాలి వేళ్లకు చుట్టులు ఉండటంతో మృతురాలు వివాహితని, వయసు 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు.

సంఘటన స్థలంలో లభ్యమైన మూత.. కిరోసిన్‌ టిన్‌ మూతై ఉంటుందని, చాకు భాగం కూడా దొరికింది. మృతురాలు ఎవరనేది తెలియకుండా ఆమెను హత్య చేసి కాల్చివేసే ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో విషయం బయటపడింది. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు తల వెనుక భాగంలో, ఛాతిపై కత్తితో పొడిచిన తీవ్ర గాయాలు ఉండటాన్ని గుర్తించారు. ముందుగా హత్య చేసి తర్వాత దహనం చేసి ఉంటారని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హతురాలికి తెలిసిన వారే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని అంటున్నారు. 

రబీ సీజన్‌ ముగియడంతో రైతులు ఎక్కడికక్కడ పొలాల్లో గడ్డిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో, పొలాల్లో దహనం చేసినా ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని దహనం చేసేందుకు పట్టణ శివార్లలోని పొలాలను ఎంచుకుని ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. వివాహితను నమ్మించి ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోకి తీసుకువచ్చి ఈ ఘాతానికి పాల్పడ్డారా? లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పొలాల్లో తగలబెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో టిన్‌ మూత లభ్యం కావడం బట్టి మృతదేహాన్ని దహనం చేసేందుకు కిరోసిన్, లేదా పెట్రోల్‌ వంటి వాటిని వినియోగించవచ్చునని తెలుస్తోంది.

పోస్టుమార్టం కోసం మృతదేహం భాగాలు  
పోస్టుమార్టం కోసం మృతదేహం భాగాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐస్‌ పెట్టెలో ఉంచారు. హతురాలి ఫొటోలను చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లకు పంపించి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పట్టణ సీఐ కె.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్‌కుమార్‌ అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 83329 57926కు సమాచారం తెలియజేయాలని ఎస్సై రాజేష్‌కుమార్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement