కాకినాడ నడిబొడ్డున మహిళ హత్య

Woman Murder In Kakinada East Godavari - Sakshi

కాకినాడ రూరల్‌: కాకినాడ బ్యాంక్‌పేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పేటలో నివాసం ఉంటున్న పెంకే విజయలక్ష్మి అలియాస్‌ జయమ్మ (54) గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈమెను ముందు పీక నొక్కి, అనంతరం ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన జయమ్మకు భర్త చనిపోయి ఏడేళ్లయ్యింది. ఏడాదిన్నర క్రితం మండపేటకు చెందిన కట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిందని, అనంతరం ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జయమ్మ ఇంటికి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లింటికి వెళ్లి రావడానికి కేవలం మూడు అడుగుల సందు మాత్రమే ఉంది. 

వెళ్లిన మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. జయమ్మకు రెండు అంతస్తుల డాబా ఇల్లు ఉండగా ఓ పోర్షన్‌లో ఆమెతో పాటు ఆమె రెండో భర్త కట్టా వెంకటేశ్వర్లు ఉంటూ మిగిలిన పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటితో పాటు జయమ్మకు మండపేటలో రెండు డాబా ఇళ్లు, ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పదేళ్లుగా జయమ్మ మండపేట నుంచి వచ్చి బ్యాంకుపేటలో ఉన్న ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళుతుంటుందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఏడాదిగా రెండో భర్త వెంకటేశ్వర్లుతో వచ్చి ఇక్కడ ఉంటోందంటున్నారు. నెల రోజుల క్రితం బ్యాంకుపేట వచ్చి తన ఇంట్లోనే రెండో భర్త వెంకటేశ్వర్లుతో ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో అక్క కుమార్తెను పెంచి పెళ్లి చేసిందని, రెండో భర్తగా చేసుకున్న వెంకటేశ్వర్లుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారని పోలీసులు వివరించారు.

జయమ్మ హత్య జరగడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు.  జయమ్మ హత్య జరిగిన మంచం కింద కట్టా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో ఉండడం గమనించిన పోలీసులు, స్థానికులు అతడిని వైద్య నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వెంకటేశ్వర్లుకు తగిలిన గాయం పెద్దదేమీ కాదని, అయితే ఇతడిని హత్య ఎలా జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో వచ్చి తమపై దాడి చేశారని, ఎవరనేది తాను చెప్పలేనని, మండపేటలో ఓ షావుకారుకి, జయమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని, వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు వివరించినట్టు సమాచారం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ హత్య చేశారా? లేక జయమ్మ ఆస్తులు ఎవరికైనా వెళ్లిపోతాయని ఆమెతో ఉంటున్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్రైమ్‌ డీఎస్పీ పల్లపురాజు, డీఎస్పీ రవివర్మ, త్రీటౌన్‌ సీఐ దుర్గారావు సందర్శించి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. జయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దుర్గారావు తెలిపారు. శవపం^నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top