అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

Woman Farmer Commits Suicide in Chittoor - Sakshi

రూ.14 లక్షల మేర అప్పులు

చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక..

విషపు గుళికలు తిని ఆత్మహత్య

నిండ్ర: అప్పుల బాధ భరించలేక, వడ్డీలు కట్టలేని స్థితిలో నిండ్ర మండలంలోని అగరం పంచాయతీ అగరంపేటకు చెందిన మహిళా రైతు జయంతి(55) ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నిండ్ర పోలీసుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని అగరంపేటకు చెందిన బాలరాజుశెట్టి భార్య జయంతికి రెండు ఎకరాలు పొలం ఉంది. 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో బాలరాజుశెట్టి మృతిచెందాడు. వారికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం వర్షాలు సక్రమంగా లేకపోవడంతో పొ లంలో బోరు వేయడానికి గ్రామంలోని ప్రైవేటు వ్యక్తుల వద్ద లక్ష రూపాయలు అప్పు చేసింది. అయితే బోరు వేసినా నీరు పడలేదు. దీంతో పంట సాగు చేయడం కష్టంగా మారింది. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి కోసం బయట రూ.5 లక్షలు చేసింది. అప్పటి నుంచి చేసిన అప్పులకు వడ్డీ పెరిగింది. అలాగే వెంగళత్తూరు గ్రామీణ బ్యాంకులో మరో రూ.లక్ష అప్పు చేసి పొలంలో మరో బోరు వేయగా కొద్దిపాటి నీటితో వరి, వేరుశనగ పంటలు సాగు చేసింది. పంటల దిగుబడి రాక కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో అప్పుల భారం పెరిగిపోయింది. రెండేళ్లుగా తన పొలంలో మరో మూడు బోర్లు వేయడానికి గ్రామంలోని ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ.2 లక్షలు అప్పులు చేసింది. బోర్లు వేసినా నీరు రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక గతంలో రూ.7 లక్షలు అప్పులు మొత్తం వడ్డీతో కలిసి రూ.14 లక్షలు దాకా అయ్యాయి. ఆదివారం ఇంట్లో అందరూ నిద్రించిన తరువాత ఆమె విషపుగుళికలు తిని మృతి చెందింది. జయంతి మృతదేహాన్ని ఎస్‌ఐ మహేష్‌బాబు పరిశీలించి శవ పరీక్ష కోసం నగరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

పరామర్శించిన నాయకులు
మృతి చెందిన మహిళా రైతు జయంతి మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సోదరుడు కుమార్‌స్వామి రెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి రెడ్డి, స్థానిక నాయకులు నాగభూషణంరాజు, మాజీ సర్పంచ్‌ దీనదయాళ్‌ సందర్శించి, నివాళులర్పించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top