breaking news
Woman farmer suicide
-
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య
నిండ్ర: అప్పుల బాధ భరించలేక, వడ్డీలు కట్టలేని స్థితిలో నిండ్ర మండలంలోని అగరం పంచాయతీ అగరంపేటకు చెందిన మహిళా రైతు జయంతి(55) ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నిండ్ర పోలీసుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని అగరంపేటకు చెందిన బాలరాజుశెట్టి భార్య జయంతికి రెండు ఎకరాలు పొలం ఉంది. 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో బాలరాజుశెట్టి మృతిచెందాడు. వారికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం వర్షాలు సక్రమంగా లేకపోవడంతో పొ లంలో బోరు వేయడానికి గ్రామంలోని ప్రైవేటు వ్యక్తుల వద్ద లక్ష రూపాయలు అప్పు చేసింది. అయితే బోరు వేసినా నీరు పడలేదు. దీంతో పంట సాగు చేయడం కష్టంగా మారింది. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి కోసం బయట రూ.5 లక్షలు చేసింది. అప్పటి నుంచి చేసిన అప్పులకు వడ్డీ పెరిగింది. అలాగే వెంగళత్తూరు గ్రామీణ బ్యాంకులో మరో రూ.లక్ష అప్పు చేసి పొలంలో మరో బోరు వేయగా కొద్దిపాటి నీటితో వరి, వేరుశనగ పంటలు సాగు చేసింది. పంటల దిగుబడి రాక కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో అప్పుల భారం పెరిగిపోయింది. రెండేళ్లుగా తన పొలంలో మరో మూడు బోర్లు వేయడానికి గ్రామంలోని ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ.2 లక్షలు అప్పులు చేసింది. బోర్లు వేసినా నీరు రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక గతంలో రూ.7 లక్షలు అప్పులు మొత్తం వడ్డీతో కలిసి రూ.14 లక్షలు దాకా అయ్యాయి. ఆదివారం ఇంట్లో అందరూ నిద్రించిన తరువాత ఆమె విషపుగుళికలు తిని మృతి చెందింది. జయంతి మృతదేహాన్ని ఎస్ఐ మహేష్‌బాబు పరిశీలించి శవ పరీక్ష కోసం నగరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పరామర్శించిన నాయకులు మృతి చెందిన మహిళా రైతు జయంతి మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరుడు కుమార్‌స్వామి రెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి రెడ్డి, స్థానిక నాయకులు నాగభూషణంరాజు, మాజీ సర్పంచ్ దీనదయాళ్ సందర్శించి, నివాళులర్పించారు. -
కష్టాలే కాటేశాయి!
అప్పుల బాధ వల్లే మహిళ రైతు ఆత్మహత్య అక్కిరెడ్డిపాలెంలో దర్యాప్తు {ధువీకరించిన రెవెన్యూ అధికారులు అనకాపల్లి: కలిసి రాని సాగు.. అందని కౌలు రైతు చట్టాల ఫలాలు.. క్షీణిస్తున్న కుమారుని ఆరోగ్యం.. కుటుంబ పోషణలో భాగస్వామి కాలేకపోతున్న భర్త.. ఏయేటికాయేడు పెరిగిపోతున్న అప్పులు ఆ మహిళా రైతును కుంగదీశాయి. మరణమే శరణ్యం అనుకొంది. అందరిలోనూ కలగొలుపుగా, మహిళ అయినా కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన అక్కిరెడ్డిపాలెం మహిళా రైతు నారపిన్ని కాసులమ్మ(45) తన కుటుంబీలకు దిక్కుమొక్కు లేకుండా చేసి బలిదానం చేసుకొంది. మహిళా రైతు ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్ఫుటం చేసింది. ఒక సగటు కుటుంబం పడుతున్న బాధలకు ప్రభుత్వం ఏ మాత్రం బాసటగా నిలవలేదని చెప్పేందుకు కాసులమ్మ ఆత్మహత్య ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రుణమాఫీ అమలుకాక, హుద్‌హుద్ తుఫాన్ నష్టపరిహారం నేటికీ అందక, సాగు గిట్టుబాటుకాక రైతులు అల్లాడుతున్నా ఇప్పటి ప్రభుత్వానికి, పాలకులకు పట్టటం లేదని చెప్పేందుకు ఈ ఉదంతం ఒక మచ్చుతునక. కుటుంబానికి పెద్ద దిక్కు : నారపిన్ని కాసులమ్మ జీవన శైలి ఒక ఆదర్శనీయం. కంటి చూపు మందగించిన భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. కిడ్నీ రోగంతో బక్కచిక్కిపోతున్న కొడుకు బాధలను సైతం తన భుజాన వేసుకొంది. మహిళే అయినప్పటికీ పొద్దున నుంచి పొద్దే ఎక్కే వర కూ కుటుంబ పోషణకు అంకితమైన ఆ తల్లి కష్టాల ముంది ఓడిపోయి బలవన్మరణం పొందింది. కాసులమ్మ భర్త అప్పారావు ఇటీవల కాలంలో కంటి చూపు మందగించింది. అదే సమయంలో ఒక్కాగానైన ఒక్క కుమారుడు కిడ్నీలో సమస్య కారణంగా నెల రోజుల నుంచి ఆస్పత్రిలో వైద్యం కోసం తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. కాసులమ్మ ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసింది. కొడుకుకు ఆరోగ్యం బాగోకపోవడంతో కోడలితో కలిసి పాడి మీద దృష్టి పెట్టింది. ఇటీవల వారికున్న 90 సెంట్ల భూమిలో 20 సెంట్లు విక్రయానికి సిద్ధపడి అడ్వాన్స్ తీసుకున్నారు. ఆన్లైన్ భూమి వివరాలు నిక్షిప్తం కాకపోవడంతో రిజిస్ట్రేషన్ అవలేదు. అప్పటికే ఉన్న రూ. 10 లక్షల అప్పులో మూడు లక్షలు అడ్వాన్స్ తీసుకోవడం ద్వారా చెల్లించింది. ఒక వైపు అప్పు బెంగ, మరో వైపు భర్త కంటి చూపు మందగించడం, కుమారుని కిడ్నీ సమస్య ఇలా అన్ని వైపులా చుట్టుముట్టిన సమస్యలతో ఇక తట్టుకోలేక సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తహశీల్దార్ దర్యాప్తు: కాసులమ్మ మృతిపై దర్యాప్తు జరిపేందుకు తహశీల్దార్ భాస్కర్ రెడ్డి మంగళవారం ఉదయం అక్కిరెడ్డిపాలెంలోని మృతురాలి ఇంటి వద్దకు వెళ్లారు. అధికారికంగా రెండున్నర లక్షల రూపాయిల అప్పున్నట్లు తహశీల్దార్‌కు ప్రామసరీ నోట్లు లభించాయి. అప్పుల వెతల వల్లే మహిళా రైతు కాసులమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని తహశీల్దార్ ధ్రువీకరించారు. ప్రభుత్వం ఆదుకోవాలి కాసులమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సాగు కలిసిరాకపోవడం, ఏడు లక్షల రూపాయిల అప్పు ఆమెను కుంగదీశాయి. ఆమె మరణం భర్త అప్పారావు, కుమారుడు శ్రీనివాసరావులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కౌలుదారుగా ఆమెను గుర్తించి ప్రభుత్వం కుటుంబానికి న్యాయం చేయాలి. - బుద్ద శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి