బ్యాంకులో బాంబు ఉందని కాల్‌.. మహిళ అరెస్టు!

Woman Arrested For Fake Bomb Call to Manager - Sakshi

అనకాపల్లి టౌన్‌: బ్యాంకులో బాంబు ఉందని మేనేజర్‌కు ఓ మహిళ ఫోన్‌లో చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాంకుని తనిఖీ చేసిన పోలీసులకు అక్కడ బాంబు కనిపించకపోవడంతో కాల్‌ని నకిలీగా గుర్తించి సెల్‌ నెంబర్‌ ఆధారంగా మహిళను అదుపులోకి తీసుకుని విచారించి బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలలో జరిగింది. తుమ్మపాల పంచాయతీ గుండాలవీధిలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో బాంబు ఉన్నట్లు మంగళవారం బ్యాంక్‌ మేనేజర్‌ గాలి కిరణ్‌కుమార్‌కు ఫోన్‌ వచ్చింది. వెంటనే ఆయన రూరల్‌ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంకు వద్దకు వెళ్లి గాలించగా అక్కడ ఎటువంటి బాంబు లభించలేదు.

దీంతో అది ఫేక్‌ కాల్‌గా నిర్ధారించి కాల్‌ చేసిన నెంబర్‌ను ట్రేస్‌ చేశారు. ఆ నెంబర్‌ అనకాపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన ‘వెలుగు’ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని రాచేపల్లి వీర శివరంజనిదిగా గుర్తించారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇదే నెంబర్‌తో ఆమె గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయరాజుకి, మరో 16 మంది వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈవీఎంలు పేల్చడంతో పాటు ఎస్‌బీఐ బ్యాంకుల్లో బాంబులు అమర్చినట్లు మంగళవారం పలు మెసేజ్‌లు పంపినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. తన స్నేహితురాలు ఇంట్లో ఈ నెల 13న సిమ్‌ దొంగలించినట్లు తెలిపింది. శివరంజనిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top