వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Wife Killed Husband With Her Boyfriend in Hyderabad - Sakshi

ప్రియుడితో కలిసి దివ్యాంగుడైన భర్తను హత్య చేసిన భార్య

నిందితుల అరెస్ట్‌

నాగోలు:  వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి తో కలిసి ఓ మహిళ దివ్యాంగుడైన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ పుథ్వీధర్‌రావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి కాశయ్య(40) దివ్యాంగుడు. అదే ప్రాంతానికి చెందిన మేన మామ కుమార్తె నాగలక్ష్మితో 15 ఏళ్ల క్రితం  వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన కాశయ్య ఎల్‌బీనగర్‌లోని ఎస్‌బీహెచ్‌ కాలనీ వెంచర్‌–3లో సుకృత అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నాగలక్ష్మి స్థానికంగా ఇళ్లల్లో పని చేసేది. నల్లగొండ జిల్లా, కట్టవారి గుడెంకు చెందిన కొండ సైదులుతో నాగలక్ష్మి గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

సైదులు నాగలక్ష్మి కోసం తరచూ ఇంటికి వస్తుండటంతో కాశయ్య అతడిని వారించేవాడు. ఈనెల  15న రాత్రి ఇంటికి వచ్చిన సైదులు, నాగలక్ష్మితో కలిసి కాశయ్యతో గొడవపడ్డారు. దీంతో కాశయ్య తన తమ్ముడు సురేష్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగలక్ష్మి ప్రియుడితో కలిసి కాశయ్య గొంతు నులిమి హత్యచేసింది. అనంతరం కాశయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. దీనిపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల16న ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాశయ్య సోదరుడు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నాగలక్ష్మి,  సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డురావడం, తరచూ నాగలక్ష్మిని వేధిస్తున్నందునే హత్య చేసినట్లు తెలిపారు.  ఎల్‌బీనగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, డీఐ కృష్ణ మోహన్, సిబ్బంది  పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top