
విజయనగరం టౌన్: రియల్ ఎస్టేట్ వివాదంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో అసలు సూత్రధారి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కాల్పులు జరిపిన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కానీ ఈ కుట్రవెనుక అసలు నిందితుడెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నిందితుడే కావాలని చేశాడా?.. లేక ఎవరైనా ఇందుకు పురమాయించారా? .. పెద్దల హస్తం ఉందా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. విద్యలనగరమైన విజయనగరం వంటి ప్రశాంత నగరంలో కాల్పులు జరగడంతో జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. నిందితుడు బొత్స మోహన్ ఉపయోగించిన గన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే అది ఎక్కడ ఉందనే విషయంలో నిందితుడు స్పష్టత ఇవ్వలేదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థికలావాదేవీల కారణంగా ఈ సంఘటన జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధం దొరికితే కేసుకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అప్పలరాజు విశాఖ కేర్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఆయన నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇంతకుముందు కూడా బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. తాజాగా విజయనగరంలో కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ పాలరాజు చెబుతున్నారు.