రూ.3వేలకోసమే అనూష హత్య

West godavari Police Reveals Anusha Assassinated Case - Sakshi

ఐదు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌  

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఈనెల 7న పెదవేగి మండలం మొండూరు గ్రామం పోలవరం కుడికాలువ గట్టు వద్ద కనుగొన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు గుజ్జుల సందీప్‌కు మృతురాలు అనూషకు మధ్య రూ.3 వేల విషయమై ఏర్పడిన వివాదం కాస్తా హత్యకు దారితీసినట్లు పోలీసు విచారణ వెల్లడైంది. నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో రూరల్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్సై చావా సురేష్, పెదవేగి ఎస్సై నాగ వెంకటరాజు, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఉన్నారు.  దెందులూరు మండలం నాగులదేవుపాడు గ్రామానికి చెందిన గుజ్జుల సందీప్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మృతురాలు జానపూడి అనూష(30)తో శారీరక సంబంధం ఉంది. (అనూష భర్త గతంలో చనిపోయాడు). కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావటంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా అడిగింది.

తాను ఆటో వాయిదా కట్టేందుకు దాచిన సొమ్ము రూ.3 వేలు అనూషకు ఇచ్చాడు. అనంతరం సందీప్‌ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆటో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న సందీప్‌ కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనూష ఫోన్‌ చేసి సందీప్‌ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్‌ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిశారు. అనంతరం సందీప్‌ ఆమెను డబ్బులు గురించి అడగటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సందీప్‌ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె ముక్కు, నోటిని తన రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. ఆమె చనిపోవటంతో అనూష మొబైల్‌ ఫోను, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ కార్డు తీసుకుని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ హత్య కేసును ఛేదించటంలో ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది హెచ్‌సీ వై.ఏసేబు, కానిస్టేబుల్స్‌ కిషోర్, ఎస్‌కే నాగూర్, సురేష్, డీ.సురేంద్ర, టీ.జయకుమార్‌లను డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top