సాక్షి, పెరంబూరు: వేందర్ మూవీస్ మదన్ కేసు గత ఎడాది పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని మదన్ సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై ఎస్‌ఆర్‌ఎం అధినేత పచ్చముత్తు అసత్య ప్రచారం చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడేందుకే పచ్చముత్తు నా ఆస్తులను విక్రయించి రూ.88 కోట్లు వసూలు చేసినట్టుగా కొత్త నాటకమాడుతున్నారన్నారు. ఆ మొత్తంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మదన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో సీట్లు ఇప్పిస్తానని చెప్పి మదన్ పలువురి వద్ద మదన్ కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించినట్టు నమోదైన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2016 మే 27న కాశీకి వెళ్లి ఆత్మహత్య చేసుకోనున్నట్టు లేఖ రాసి మదన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బునంతా ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం అధినేత పచ్చముత్తుకు అప్పగించినట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. దీంతో సెంట్రల్ నేర పరిశోధన పోలీసులు రంగంలోకి దిగి మదన్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పచ్చముత్తు హస్తం ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ అనంతరం విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 91 కోట్లను వారి తల్లిదండ్రులకు తిరిగి చెల్లించనున్నట్లు పచ్చముత్తు చెప్పడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల పాటు పోలీసులు గాలింపు చేపట్టి వేందర్ మూవీస్ మదన్‌ను తిరుపూర్‌లో ఆయన ప్రియురాలి ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆయన కూడా బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ కేసులో పలు కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ) అధికారులు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో గత ఐదేళ్ల కిందట చదివిన విద్యార్థులను విచారిస్తున్నారు. కాగా ఆ మొత్తాన్ని మదన్ నుంచి వసూలు చేసినట్లు పచ్చముత్తు వర్గం ప్రచారం చేస్తోంది. దీన్ని ఖండిస్తూ మదన్ సోమవారం ఉదయం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు పచ్చముత్తును త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం వెలుగులోకి రావడంతో కేసు నుంచి బయటపడేందుకే విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 88 కోట్లను తన ఆస్తులను విక్రయించి వసూలు చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో పచ్చముత్తు ప్రచారం చేయిస్తున్నారని పిర్యాదులో ఆరోపించారు. ఆ డబ్బుకు తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును తాను అప్పుడే పచ్చముత్తుకు అప్పగించానని మదన్ తెలిపారు. ఈడీకి భయపడే తనను ఆ కేసులో ఇరికించడానికి పచ్చముత్తు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.


