చీరాలలో పట్టపగలే దారుణ హత్య

Uncle Assassinated Son in law in Chirala Prakasam - Sakshi

అల్లుడిని అంతమొందించిన మామ, ఇతర బంధువులు

కుటుంబ కలహాలే హత్యకు కారణం

ప్రకాశం, చీరాల రూరల్‌: చీరాలలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లనిచ్చిన మామే తన బంధువుల సాయంతో అల్లుడిని తరుముకుంటూ వెంటాడి గొడ్డలితో హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చీరాల మండలం సాయి కాలనీలో జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. స్థానిక రామ్‌నగర్‌ ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో మోటా దిలీప్‌ (27) కుటుంబం నివాసం ఉంటోంది. రెబక అనే యువతిని ఎనిమిదేళ్ల క్రితం దిలీప్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది, ఏడేళ్ల పిల్లలున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. రెబక పెద్దనాన్న పీరిగ వెంకటేశ్వర్లు రామ్‌నగర్‌లోని ఇంటి వద్ద కూర్చుని దిలీప్‌తో రెబక విషయం మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రçహానికి గురైన దిలీప్‌ ఓ సీసా పగలకొట్టి వెంకటేశ్వర్లుపై మూడు చోట్ల దాడి చేసి గాయపరిచాడు.

సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు తమ్ముడు పీరిగ చిన్న (పిల్లనిచ్చిన మామ), అతని కుమారుడు రవితేజ, చెంగయ్య మరో ఇద్దరు కలిసి దిలీప్‌ను హతమార్చేందుకు గొడ్డళ్లు తీసుకుని వెంబడించారు. దిలీప్‌ వారి బారి నుంచి తప్పించుకునేందుకు రామ్‌నగర్‌కు సమీపంలోని సాయి కాలనీలోకి పరుగులు తీశాడు. అయినా వారంతా దిలీప్‌ను వెంబడించి సాయికానీలోని ఓ దుకాణం వద్ద పట్టుకుని గొడ్డలితో తలపై, చేతులపై నరకడంతో తీవ్ర రక్త స్రావానికి గురై దిలీప్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 వాహనానికి, టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనం సంఘటన స్థలానికి రావడం ఆలస్యం కావడంతో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తన సిబ్బంది సాయంతో క్షతగాత్రుడిని తమ పోలీసు వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. మార్గంమధ్యలో 108 వాహనం రావడంతో అతడిని ఆ వాహనంలోకి ఎక్కించి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దిలీప్‌ మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి మణెమ్మ, ఆమె బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ ఫిరోజ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top