గొంతులు కోసి.. మహిళల దారుణహత్య..

Two Women Brutal Murder in Karnataka - Sakshi

ఉద్యాన నగరిలో రక్తపుటేరులు

దోపిడీకి వచ్చి మహిళ గొంతు కోసిన దుండగులు

ఇంటిని ఖాళీ చేయలేదని మహిళను చంపిన యజమాని 

సాక్షి, బెంగళూరు: ఉద్యాన నగరిలో హంతకులు చెలరేగిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని గొంతుకలు కోసి రక్తపుటేరులు పారించారు.  బ్యాటరాయనపుర, సుద్దగుంటేపాళ్య పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. బ్యాటరాయనపుర పరిధిలోని కస్తూరిబానగర 5 వక్రాస్‌ 6 వ మెయిన్‌రోడ్డులో శివరామ్, కవితా(26) దంపతులు నివాసం ఉంటున్నారు. శివరామ్‌ నాయండహళ్లి ప్‌లైవుడ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు.   

ఇతను గురువారం ఉదయం దుకాణం విదులకు వెళ్లగా 9 గంటల సమయంలో కవితా తన ఇద్దరు పిల్లలైన లిఖిత్, హర్షిత్‌ లను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చాకుతో గొంతుకోసి ఆమెను హత్యచేశారు. బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 9.50 సమయంలో  కవిత తండ్రి  ఇంటికి రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది. బ్యాటరాయనపుర పోలీసులు డాగ్‌స్క్వాడ్, వేలిముద్రనిపుణులతో చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీస్‌కమిషనర్‌ బీకే.సింగ్, డీసీపీ అనుచేత్‌  ఘటనా స్థలాన్ని సందర్శించారు.  నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

ఇంటిని ఖాళీ చేయనందుకు మహిళ గొంతుకోసిన యజమాని
ఇంటిని ఖాళీ చేయలేదని అద్దెకు ఉంటున్న మహిళను గొంతుకోసి హత్యచేసిన యజమాని ఉదంతం సుద్దగుంటెపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కమలమ్మ అనే మహిళ ప్రైవేటు కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సుద్దగుంటెపాళ్య గుండుతోపులో జగదీశ్‌ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఇంటి లీజు అవధి ముగియడంతో ఖాళీ చేయాలని యజమాని జగదీశ్‌ సూచించాడు. 

అయితే అడ్వాన్స్‌ వెనక్కి ఇవ్వాలని, అంతవరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని కమలమ్మ స్పష్టం చేసింది. ఈక్రమంలో జగదీశ్‌ స్నేహితులైన సంతోష్, కేశవ్‌తో కలిసి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనుంచి ఇద్దరు పిల్లలను బయటికి పంపించి కమలమ్మతో గొడవపడ్డారు. ఓ దశలో జగదీశ్, మిగతా ఇద్దరూ కలిసి కమలమ్మ గొంతు కోసి  ఉడాయించారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని  పిల్లలు ఇరుగుపొరుగు వారి సాయంతో బౌరింగ్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.  సుద్దగుంటెపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంతోష్, కేశవ్‌ను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న జగదీశ్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top