ప్రాణం తీసిన ఈత సరదా

Two Child Deceased While Swimming in Pond Prakasam - Sakshi

మంచినీటి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

దశరాజుపల్లిలో విషాదచాయలు  

మృతుల్లో ఒకరు గ్రామ మాజీ సర్పంచ్‌ కుమారుడు

ఒంగోలు: ఈత సరదా ఇద్దరు విద్యార్థులను మృత్యుఒడికి చేర్చింది. ఈ సంఘటన ఒంగోలు మండల పరిధిలోని దశరాజుపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే..బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దశరాజుపల్లి దళితవాడకు చెందిన పాలేటి ప్రదీప్‌కుమార్, బెంగళూరు నవీన్‌కుమార్, పాలేటి నవీన్‌ అనే ముగ్గురు దశరాజుపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. వీరిలో ప్రదీప్‌కుమార్‌(16), బెంగళూరు నవీన్‌కుమార్‌(15)లు ఈతకు చెరువులోకి దిగారో లేదో వెంటనే మునిగిపోయారు. ఇది గమనించి ఒడ్డున ఉన్న యువకుడు చేయి అందించేందుకుయత్నించగా అతని కాలు బురదలో కూరుకుపోయింది. కళ్ల ముందే ఇద్దరు మిత్రులు నీటిలో మునిగిపోవడాన్ని చూసిన నవీన్‌ పెద్ద పెట్టున కేకలు వేసుకుంటూ బురదలో కూరుకుపోయిన కాలును తీసుకొని గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలియజేశాడు. గ్రామస్తులు హుటాహుటిన పెద్ద కర్రలతో చెరువులో గాలించగా తొలుత ప్రదీప్‌కుమార్, అనంతరం కొద్దిసేపటికి నవీన్‌కుమార్‌లను గుర్తించి వెలికితీశారు.

వెంటనే ఆటోల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ప్రదీప్‌కుమార్‌ ఆ గ్రామ మాజీసర్పంచ్‌ శ్రీనివాసరావు కుమారుడు. సంతనూతలపాడు ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేశాడు. బెంగళూరు నవీన్‌కుమార్‌ ఆంజనేయులు, శాంతిల కుమారుడు. వీరికి ముగ్గురు అబ్బాయిలు కాగా నవీన్‌కుమార్‌ పెద్ద కుమారుడు. నవీన్‌కుమార్‌ దర్శిలోని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేశాడు. ఎదిగి వస్తున్నారనుకున్న ఇద్దరు పిల్లలు దుర్మరణం కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటుండడంతో ఇటీవలే చెరువు లోతు తీయించి చెరువు నిండా నీరును సోమవారం వరకు అధికారులు నింపారు. అయితే చెరువు లోతును అంచనా వేయడంలో విఫలమైన చిన్నారులు చెరువులో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top