వేధింపులు తాళలేక..

TV Actor Wife Commits Suicide in Hyderabad - Sakshi

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

ఫేస్‌ బుక్‌లో పరిచయం... ప్రేమ పెళ్లి

గచ్చిబౌలి: భర్త వేధింపులు తాళలేక ఓ టీవీ నటుడి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారంచోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన లక్ష్మణ్, తిరుమల దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తె  భారతి(34) బీటెక్‌ పూర్తి చేసి, లండన్‌లో ఎంబీఏ చేసింది. అనంతరం అక్కడే మూడేళ్ల పాటు ఉద్యోగం చేసింది.ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో టీవీ సీరియల్‌ నటుడు మధు ప్రకాశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకుంది. అయితే గత ఏడాదిగా మరో టీవీ సీరియల్‌ నటితో పరిచయం పెంచుకున్న మధు భార్యను తరచూ వేధించడమేగాక సదరు యువతితో భార్యను తిట్టించేవాడు. ఓ సారి ఆమెను ఇంటికి తీసుకు రావడంతో భారతి ప్రశ్నించగా ఆమె భారతిని కొట్టిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్లిన మధుప్రకాష్‌ ఇంటికి రాకుండా అటు నుంచే ఆమె ఇంటికి వెళ్లి పోయాడు. మధ్యాహ్నం భర్తకు వీడియో కాల్‌ చేసిన భారతి తాను చనిపోతున్నాని ఫ్యాన్‌కు వేలాడుతున్న చున్నీని చూపించినా అతను  పట్టించుకోలేదు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి వచ్చిన మధు ప్రకాష్‌ తలుపు కొట్టగా స్పందించకపోవడంతో మాస్టర్‌ కీతో తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పెద్దగా పట్టించుకోలేదని మధు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో కాల్‌ చేసినప్పుడు ఇంట్లోనే మరో గదిలో ఉన్న మామ వెంకటేశ్వర్లు, అత్త లక్ష్మీలను అప్రమత్తం చేసినా పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఖరగ్‌పూర్‌లో ఉంటున్న మధు ప్రకాష్‌ కుటుంబం టీవీ సీరియల్స్‌లో అవకాశం రావడంతో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ రూ. 15 లక్షల నగదు, 30 తులాల బంగారు కట్న కానుకలుగా ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీవీ సీరీయల్‌లో నటించే ప్రిన్సీ అనే యువతితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి మధు ప్రకాష్, భారతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

అందరూ ఉన్నా ఒంటరే...
భర్తే తన ప్రపంచం అనుకున్న భారతి తన గదిలోని  గోడలకు అతని ఫొటోలు అంటించి ప్రేమను చాటుకుంది.  భర్త, అత్త, మామలతో కలిసి ఉంటున్నా, భర్తతో మనస్పర్థలు, అత్త, మామలతోనూ ఎడ మొహం పెడ మొహంగా ఉండటంతో ఆమె బెడ్‌ రూమ్‌కే పరిమితమైంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కార్వీలో పని చేసే భారతి ఎక్కువగా బెడ్‌ రూమ్‌లోనే ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. తన వంట తానే చేసుకునేదని, ఆమె చేసిన వంటను అత్తామామలు తినేవారు కారని భారతి తల్లి తిరుమల పేర్కొన్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుప్రకాష్, తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి లక్ష్మీలను  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 నరకం చూపించారు
టీవీ సీరియల్‌ నటి ప్రిన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మధు ప్రకాష్‌ నరకం చూపించడంతో భరించలేక తన కుమార్తె భారతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి తిరుమల పేర్కొన్నారు. ఏడాదిగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కుమారుడికి బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు కోడలిని వేధించారని ఆమె ఆరోపించారు. విడాకుల కోసం ఒత్తిడి తేవడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top