ముసుగు దొంగలొచ్చారు.. తస్మాత్‌ జాగ్రత్త.!

Trembling Rajampet With Fear Of Thieves - Sakshi

ముఖాలకు ముసుగులు ధరించి ఇళ్లలోకి ప్రవేశించేందుకు యత్నం

నాలుగు రోజులుగా రాజంపేటను వణికిస్తున్న దొంగల భయం

రాత్రి వేళల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టాలంటున్న ప్రజలు

సాక్షి, రాజంపేట టౌన్‌: గత కొంతకాలంగా దొంగల బెడద లేకపోవడంతో రాజంపేట పట్టణ ప్రజలు రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే కొద్దిరోజులుగా పట్టణంలో ముసుగు దొంగల ముఠా సంచరిస్తోందన్న సమాచారంతో ఇప్పుడు పట్టణ వాసులకు రాత్రి వేళల్లో కునుకు లేకుండా పోతోంది. పట్టణంలోని సరస్వతీపురంవీధిలో గత నాలుగు రోజులుగా దొంగలు పలువురి ఇళ్లలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. ఆ ప్రాంతంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి కటాంజనం గేట్లు, తలుపులు తడుతున్నారు. దీంతో ప్రజలు గడియారంలో సమయం చూసుకొని కిటికీల నుంచి బయటికి తొంగి చూస్తే దొంగలు తలుపులు తీయమని బెదిరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

దొంగలను చూడగానే ఇంటి యజమానులు భయాందోళనతో గట్టిగా కేకలు వేయడం, ఇరుగు, పొరుగు వారికి ఫోన్‌ చేస్తుండటంతో దొంగలు కాళ్లకు బుద్ధి చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంటి ఆవరణలోకి దొంగలు వచ్చి కటాంజనం గేటు తీయాలని కత్తిచూపి  బెదిరించడంతో ఆ ఇంటిలోని వారు భయంతో వణికి పోయి గట్టిగా కేకలు కూడా వేయ లేకపోయారు. కొంతసేపటికి తేరుకొని ఎదురింటి వాళ్లకు ఫోన్‌ చేయడంతో వారు బయటికి రావడాన్ని దొంగలు గమనించి పరారయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున సరస్వతీపురం వీధిలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే రహదారిలో కుక్కలు ఎక్కువగా మొరగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒకరికొకరు ఫోన్‌లు చేసుకొని బయటికి వచ్చారు. దీంతో నలుగురు దొంగలు ఆ ప్రాంతం నుంచి అగ్రహారం వెళ్లే దారిలో పరుగులు తీసినట్లు అక్కడి ప్రజలు తెలిపారు.

ఆ వీధిలోకే ఎందుకు వస్తున్నారు..
వరుసగా నాలుగు రోజుల నుంచి దొంగలు సరస్వతీపురం వీధిలోకి వస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సరస్వతీపురంవీధి రైల్వేస్టేషన్‌కు దగ్గరగా ఉండటం వల్ల దొంగలు రైలుదిగి నేరుగా ఈ వీధిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వీధికి దగ్గరలోనే కృష్ణమ్మ చెరువు,  జూనియర్‌ కళాశాల క్రీడామైదానం ఉండటం వల్ల దొంగలు సరస్వతీపురాన్ని లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

రాత్రి అవుతుందంటే భయమేస్తోంది
ఈ మధ్య రోజూ దొంగలు మా వీధిలో ఎవరో ఒకరి ఇంటికి వచ్చి తలుపులు తడుతున్నారు. పొద్దున్నే ఇరుగు పొరుగు వారు దొంగల గురించి మాట్లాడుకుంటుంటే కాళ్లు, చేతులు వణుకు పుడుతున్నాయి. ఇప్పుడు రాత్రి అవుతుందంటే భయమేస్తోంది. చీకటి పడకముందే ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నాం.    –  లక్ష్మీదేవి, సరస్వతీపురం, రాజంపేట

భయపడకండి.. మేమున్నాం
సరస్వతీపురంవీధిలోకి నిత్యం రాత్రి వేళల్లో దొంగలు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే ప్రజలు ఎవరు కూడా భయపడవద్దు. రాత్రి వేళల్లో పట్టణమంతా మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సరస్వతీపురం వీధిపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం.
–శుభకుమార్, సీఐ, అర్బన్‌ పోలీస్‌ స్టేషన్, రాజంపేట 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top