అడ్డగిస్తే హతమారుస్తారు..!

Train Robbery Gang Arrest In Guntur - Sakshi

రైలు మార్గాల వెంటే వారి లక్ష్యాలు

ముఠాగా రావడం, దోపిడీలు చేసి వెళ్లడం

తెలుగు రాష్ట్రాలే లక్ష్యంగా దోపిడీలు

ఇప్పటికే 23 చోరీలు చేసినట్టు ప్రాథమికంగా నిర్థారణ

విచారణ కొనసాగిస్తున్న రెండు రాష్ట్రాల పోలీసులు

గుంటూరు:    విహార యాత్రలకు వెళ్లినట్టుగా సరదాగా వెళ్లి, దోపిడీలు, దొంగతనాలు చేస్తారు... ఆ సమయంలో ఎవరైనా అడ్డగించేందుకు యత్నిస్తే రాళ్లు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చేందుకు కూడా వెనుకాడరు. చోరీలను వృత్తిగా ఎంచుకున్న వీరు ఇతర రాష్ట్రాల్లో చోరీలు చేసి స్వగ్రామాలకు వెళ్లి  సరదాగా గడుపుతారు. ఆ మధ్య వచ్చిన ఖాకీ చిత్రం తరహాలోనే వీరు దోపిడీలు కొనసాగిస్తారంటే అతిశయోక్తి కాదు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దోపిడీ దొంగల ముఠా సభ్యులను బుధవారం గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించే క్రమంలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధారా జిల్లా ఖరాచక్‌బాగ్‌ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల సభ్యులు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. మూడు నుంచి వారం రోజులపాటు ముందుగా నిర్దేశించుకున్న పట్టణాలకు రైలు మార్గంలోనే ముఠా సభ్యులు ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో వారు సెల్‌ఫోన్లు కూడా వాడకపోవడం గమనార్హం.

చోరీలు ఇలా...
తెలుగు రాష్ట్రాల్లో సంపాదన, సంపద మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కంటే అధికంగా ఉంటుందని, పత్రికల ద్వారా తెలుసుకున్నారు. దీంతో కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో చోరీలను చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 23 ప్రాంతాల్లో చోరీలు చేసి దర్జాగా వెళ్లినట్టు పోలీసుల విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఈ దిశగా పోలీసులు రెండు రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దర్యాప్తును వేగవంతంగా కొనసాగిస్తున్నట్టు సమాచారం.

దోపిడీ చేయడమే లక్ష్యం...
వీరు రైలు మార్గాలకు సమీపంలో ఉన్న పెద్ద పెద్ద అపార్టుమెంట్‌లను లక్ష్యంగా చేసుకుంటారు. రైలు దిగిన వెంటనే గంటపాటు రెక్కీ నిర్వహించి వెళ్లిపోతారు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై ముఠా సభ్యులందరూ కలిసి ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించి నిమిషాల వ్యవధిలో దోపిడీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఇంటి యజమానులు ఎవరైనా అడ్డుకునేందుకు, కేకలు వేసేందుకు యత్నించినా నిర్దాక్షిణ్యంగా వారి వెంట తెచ్చుకున్న రాళ్లు, ఇనుపరాడ్‌లతో తలపై మోది హతమార్చేందుకు కూడా వెనుకాడని ప్రమాదకరమైన దొంగలు. దోపిడీ పూర్తయిన అనంతరం వెంటనే సమీపంలోని రైలు మార్గం ద్వారానే మరో ప్రాంతానికి వెళ్లి అదేరోజు రాత్రి మరో దోపిడీ చేస్తారు. అక్కడి నుంచి వారు నిర్దేశించుకున్న నగదు, డబ్బు దోచుకున్న అనంతరం వారి స్వగ్రామానికి వెళతారు. ఎవరైనా పోలీసులు నిందితులను గుర్తించి ఆ గ్రామానికి వెళ్లాలని యత్నిస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోరని అక్కడ ఉన్న పోలీసులే వెళ్లవద్దని చెప్పారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

నాణ్యమైన సీసీ కెమెరాలు వినియోగించాలి
అపార్టుమెంట్‌లు, భవనాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలి. హోటళ్లు, దుకాణాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్నట్టు అయితే సమీప పోలీసు స్టేషన్‌లో వారి సమాచారాన్ని తప్పకుండా అందజేయాలి. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలి.– అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌.విజయారావు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top