ఈత రాక ముగ్గురు అన్నదమ్ముల మృతి | Three died..they dont know how to Swim | Sakshi
Sakshi News home page

ఈత రాక ముగ్గురు అన్నదమ్ముల మృతి

Mar 9 2018 11:48 AM | Updated on Sep 28 2018 3:39 PM

Three died while Swimming - Sakshi

మృతులు రవికుమార్‌, పవన్‌ కుమార్‌, ఆంజనేయలు

అడ్డాకుల (దేవరకద్ర): వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఏటా రామలింగేశ్వరుడి జాతరకు కుటుంబ సమేతంగా వచ్చేవారు. ఈ సారి కూడా ఎప్పటిలాగే వచ్చారు. కోనేరులో స్నానాలు చేద్దామని తండ్రితోపాటు ముగ్గురు కుమారులు లోపలికి దిగారు.  దరి అంచున నిలబడి స్నానాలు చేద్దామనుకుంటుండగా చిన్న కుమారుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్లలో మునిగిపోయాడు. అతడిని కాపాడే యత్నంలో మిగిలిన ఇద్దరు కుమారులు ఒక్కొక్కరుగా నీళ్లలోకి జారుకున్నారు.

ఈత రాని తండ్రి కూడా లోపలికి వెళ్లినా ముగ్గురిని కాపాడలేకపోయాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించి వెంటనే కేకలు వేయడంతో.. భార్య చీర విసరడంతో దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరాడు. తన కళ్ల ముందే ముగ్గురు కొడుకులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ దుర్ఘటన మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద గురువారం చోటుచేసుకుంది.

 20 ఏళ్ల క్రితం వలస..
ఖిల్లాఘనపురం మండలం కమాలొద్దీన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఉప్పరి కేశవులు 20ఏళ్ల క్రితం తన కుటుం బంతో కలిసి మహబూబ్‌నగర్‌ సమీపంలోని ఏనుగొండకు వెళ్లి స్థిరపడ్డాడు. ఆయనకు భార్య చంద్రమ్మ, ఒక కుమార్తెతోపాటు కుమారులు రవికుమార్‌(29), పవన్‌కుమార్‌(25), ఆంజనేయులు(20) ఉన్నారు. రవికుమార్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పవన్‌కుమార్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా ఏడాది క్రితమే శ్రీలతతో పెళ్లయింది. మూడో కుమారుడు ఆంజనేయులు పాలిటెక్నిక్‌ చదువుకుంటున్నాడు. తండ్రి కేశవులు భవన నిర్మాణ పనులు చేసేవాడు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులంతా కలిసి రామలింగేశ్వరుడి జాతరకు వచ్చి వెళ్లేవారు.

 మెట్లు లేకపోవడంతో..
గురువారం 9మంది కుటుంబ సభ్యులు జాతరకు రాగా తండ్రీకొడుకులు స్నానం చేయడానికి ఆలయం పక్కనే ఉన్న కోనేరు వద్దకు వెళ్లారు. కుమారులు ముగ్గురికి ఈత రాకపోవడంతో కోనేరు దరి వద్దనే నిలబడి స్నానం చేస్తున్నారు. ఈక్రమంలో కాలు జారి చిన్న కుమారుడు ఆంజనేయులు నీళ్లలో మునిగిపోయాడు. రక్షించడానికి వెళ్లిన పెద్ద కుమారుడు రవికుమార్, తర్వాత రెండో కుమారుడు పవన్‌కుమార్‌ వెళ్లి ముగ్గురూ నీటిలో మునిగిపోయారు.

వీరిని గుర్తించిన తండ్రి సైతం నీళ్లలోకి వెళ్లాడు. ఆయనకు కూడా ఈత రాకపోవడంతో నీళ్లల్లో మునిగిపోయే దశలో కేకలు వేశాడు. కోనేరు గడ్డపై ఉన్న కేశవులు భార్య చంద్రమ్మ చీరను నీళ్లలోకి విసరడంతో దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరి ప్రాణాలను దక్కించుకున్నాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు జరిగేదంతా చూస్తూ లబోదిబోమంటూ కేకలు వేశారు. ఆలయం వద్ద ఉన్న భక్తుల్లో కొందరు నీళ్లలోకి దిగి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. తండ్రితో సహా ముగ్గురు కుమారులకు ఈత రాకపోవడం.. కోనేరు వద్ద మెట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమైంది.


  రోదిస్తున్న మృతుల తల్లిదండ్రులు

 కేసు నమోదు..
కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరులో ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో ఘటనా స్థలాన్ని జడ్చర్ల రూరల్‌ సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను అడ్డాకుల ఎస్‌ఐ సతీష్‌ ట్రాక్టర్‌లో వేయించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 కొరవడిన ముందుచూపు..
ఆలయం వద్ద పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్తగా మెట్లు కట్టాలని పాత మెట్లను తొలగించారు. జాతర వచ్చినా పనులు చేయకపోవడంతో మెట్లు లేవు. మెట్ల వద్ద కొంత మట్టిని కూడా గతంలో తొలగించారు. దీంతో నీళ్లలోకి దిగి రెండడుగులు వేసినా లోపలికి పడిపోతారు. ఇదే ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమైంది. కోనేరులో కొంతదూరం వరకు గతంలో ఇనుప రక్షణ కంచెను ఏర్పాటు చేసేవారు. ఈసారి దాన్ని ఏర్పాటు చేయకపోవడం కూడా మరో కారణమైంది. గతేడాది మినహా ప్రతి ఏటా జాతరలో ఒకరిద్దరు కోనేరులో ముగిని ప్రాణాలు కోల్పోతున్నా ముందుచూపు కరువైందని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement