మితిమీరిన వేగం.. పోయింది ముగ్గురి ప్రాణం

Three Died in Car Accident Chittoor - Sakshi

మృతుల్లో ఇద్దరు యువకులు, ఒక యువతి

మరో ముగ్గురికి గాయాలు

సరదా కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు

మృతులు, గాయపడిన వారంతా తమిళనాడు వాసులే

చిత్తూరు, నగరి : సరదా కోసం వచ్చిన యువతను మితిమీరిన వేగం మృత్యు ఒడిలోకి చేర్చింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి పునాదులు ఢీకొని పల్టీలు కొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం ఈ  సంఘటన మండలంలోని వీకేఆర్‌పురం గ్రామ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జున రావ్‌ కథనం.. తమిళనాడు కాంచీపురం ఒరగడంకు చెందిన ఏంజిల్‌ (24), చెన్నై పోరూరుకు చెందిన ప్రేమ్‌ (25), కాంచీపురం గూడువాంజేరి కార్తీక్‌నగర్‌కు చెందిన ప్రతుల్‌రాజ్‌ (19), ధీరజ్‌ (23), చరణ్‌ (22), షోలింగర్‌కు చెందిన జెనియా (23) చెన్నైలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గురువారం ఎన్నికల సెలవు నేపథ్యంలో సరదాగా గడపడానికి కారులో కైలాసకోనకు వచ్చారు.

ఇక్కడ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఆ తర్వాత స్వంత ఊర్లకు వెళ్లి ఓటువేయడానికి బయలుదేరారు. ధీరజ్‌ మితిమీరిన వేగంతో కారు నడపడం ప్రాణామీదకు తెచ్చింది. మండలంలోని వీకేఆర్‌ పురం వద్ద కారు అదుపు తప్పి రోడ్డుకు సమీపంలో నూతనంగా వేసిన ఇంటి పునాదులను ఢీకొని పల్టీలు  కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ దుర్ఘటనలో ఏంజిల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.   కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికితీసి నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో  ప్రేమ్, ప్రతుల్‌ రాజ్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతరం మిగిలిన వారిని తిరుత్తణి ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసి పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top