అన్నింటి వెనుకా ఐఎస్‌ఐ హస్తం!

Terror Attacks on India Special Story - Sakshi

నగరంలో ‘జైష్, లష్కరే’ సహా అనేక ‘ఉగ్ర’ ఛాయలు

వెనుక నుంచి నడిపించింది పాకిస్తాన్‌ నిఘా సంస్థే..

1992 నుంచి సిటీలో ఉగ్రవాద పదఘట్టనలెన్నో

దేశమంతటా ఇప్పుడు ఒకే చర్చ. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందా...భారత సైన్యం దాడికి పాక్‌ ప్రతీకార దాడులకు దిగుతుందా అని. ఇటీవలి పుల్వామా దాడితోపాటు మన వైమానిక దాడుల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల చర్యలపై నగరంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో హైదరాబాద్‌లో జరిగిన పలు ఉగ్ర ఘటనలే ఇందుకు కారణం. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం), లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ),హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌(హెచ్‌యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదిహేడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్‌ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్ర ఉదంతాలపై సాక్షి ప్రత్యేక కథనం...

సాక్షి,సిటీబ్యూరో :దేశాన్ని కుదిపేసిన ‘పుల్వామా’ దాడితో పాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇటీవల పరిణామాలతో తెరపైకి వచ్చిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం), లష్కరేతొయిబా(ఎల్‌ఈటీ), హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌(హెచ్‌యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై ఏడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్‌ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి.    

హెచ్‌యూఎం.. ఏఎస్పీ కృష్ణప్రసాద్‌ హత్య
1992 డిసెంబర్‌ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఆ తర్వాతే నగరంలో, దేశంలో ఉగ్రవాదం జోరందుకుంది. అయితే, దీనికి ముందే నగరం భారీ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇంటెలిజెన్స్‌ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణప్రసాద్‌తో పాటు ఆయన గన్‌మెన్‌ వెంకటేశ్వర్లు హత్య నగరానికి సంబంధించి తొలి తీవ్రమైన ఉగ్రవాద చర్యగా చెప్పొచ్చు. టోలిచౌకిలోని బృందావన్‌ కాలనీలో హెచ్‌యూఎం ఉగ్రవాదులు తలదాచుకున్నారని కృష్ణప్రసాద్‌కు సమాచారం అందింది. దీంతో 1992 నవంబర్‌ 29న తన బృందంతో అక్కడి ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాది ముజీబ్‌ అహ్మద్‌ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు అశువులుబాసారు. ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరం అంతకు ముందుకు వరకు ఈ తరహా ఘటనల్ని ఎప్పుడూ చూడలేదు.  

2001లో గణేష్‌ ఊరేగింపు టార్గెట్‌
లష్కరే తొయిబా సంస్థ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మతకలహాలు సృష్టించాలని 2001లో కుట్ర పన్నింది. దీనికోసం నగరానికే చెందిన అబ్దుల్‌ అజీజ్‌ను తమ వైపు తిప్పుకుంది. మరికొందరితో కలిసి రంగంలోకి దిగిన ఇతగాడు గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నాడు. అలా చేస్తే నగరం మతకలహాలతో అట్టుడుకుతుందని భావించాడు. అయితే దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో మొత్తం మాడ్యుల్‌ కటకటాల్లోకి వెళ్లింది.  

సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద 2002 నవంబర్‌ 21న భారీ పేలుడు జరిగింది. దీనికి అవసరమైన కుట్రను లష్కరే తొయిబా చేసింది. ఈ సంస్థ తరఫున ఉగ్రవాదులుగా వ్యవహరించిన అహ్మద్‌ ఆజం, అబ్లుల్‌ అజీమ్‌ను రంగంలోకి దిగారు. పాలక్యాన్‌లో పేలుడు పదార్థాలు నింపి, దాన్ని స్కూటర్‌కు అమర్చడం ద్వారా పేల్చేశారు. ఈ ఉదంతంలో పద్మ అనే మహిళ, భానుప్రకాష్‌ రెడ్డి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో నలుగురు నగరంతో పాటు కరీంనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.

బీజేపీ నేత హత్యకు జేఈఎం కుట్ర
పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి తెగబడిన జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం) సంస్థ.. నగరంలో వరుస హత్యలకు కుట్ర పన్నింది. బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్, శివసేన, హిందూ వాహినీలకు చెందిన కీలక నేతలను టార్గెట్‌ చేసింది. వీరిని హత్య చేయడం ద్వారా మత కలహాలు సృష్టించాలని భావించింది. ఈ ముష్కరులు టార్గెట్‌ చేసిన వారిలో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి కూడా ఉన్నారు. ఉగ్రవాదుల కుట్ర అమల్లోకి రాకముందే నిఘా వర్గాల సమాచారంతో వీరికి చెక్‌ పడింది.  

మొట్టమొదటి మానవబాంబు దాడి
నగరంలో తొలిసారి.. ఇప్పటి వరకు ఏకైక మానవ బాంబు దాడి సైతం లష్కరే తొయిబా పనే. 2005 అక్టోబర్‌ 12న బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై దీన్ని పేల్చారు. ఆ రోజు దసరా పండగ కావడంతో అధికారులు, సిబ్బంది లేరు. అయితే ఆ పేలుడు ధాటికి ఒక హోంగార్డు బలయ్యాడు. ఈ కేసులో గులాం యజ్దానీ సహా నగరానికి చెందిన అనేకమంది ఉగ్రవాదుల ప్రమేయం ఉంది.  

హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీల్లో విధ్వంసానికి కూడా..
రాజధాని హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, హుబ్లీల్లో పేలుళ్లకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు 2012లో ఛేదించారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) విదేశాల్లో ఉన్న కొందరి ద్వారా ఇక్కడ ఉంటున్న వారిని ట్రాప్‌ చేసి విధ్వంసాలకు ప్రేరేపించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వీరి టార్గెట్‌లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, హుబ్లీ, నాందేడ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులను కాల్చి చంపడం ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని భావించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్థారించింది. ఈ కేసులో సిటీ వాసి ఒబేద్‌ కూడా ఉన్నాడు.

1993లో కశ్మీరీ సంస్థల ఛాయలు
బాబ్రీ విధ్వసం జరిగిన కొన్నాళ్లకు నగరంలో కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద సంస్థల కదలికలు కనిపించాయి. దేశ వ్యాప్తంగా ఓ వర్గానికి చెందిన యువతను ఆకర్షించి, భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి ఇక్వాన్‌ ఉల్‌ ముస్లమీన్‌ (ఐయూఎం) కుట్ర పన్నింది. డబ్బు వెదజల్లుతూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి తమ క్యాడర్‌ను రంగంలోకి దింపింది. అలా వచ్చిన వారే నిస్సార్‌ అహ్మద్‌ భట్, అమీన్‌మీర్‌. నగరానికి వచ్చిన వీరిద్దరూ కొందరిని ఉగ్రవాదులుగా మార్చారు. చాపకింద నీరుగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి కొన్ని స్థానిక సంస్థల సహకారం కూడా తీసుకున్నారు. సిటీతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు 1993 నవంబర్‌ 10న భట్, అమీన్‌తో పాటు మరికొందరినీ అరెస్టు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

అల్‌–జిహాద్‌..భారీ కుట్ర
కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘అల్‌ జిహాద్‌’ కదలికలు సిటీలో కనిపించాయి. ఈ సంస్థకు చెందిన కశ్మీరీ బిలాల్‌ అహ్మద్‌ కులూ 1993లో నగరానికి వచ్చి చిరుద్యోగిగా తలదాచుకున్నాడు. ఆపై యువతను ఆకర్షించి ఉగ్రవాద శిక్షణకు పంపాలని, వారు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు వినియోగించుకోవాలని భావించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు.  

ఎల్‌ఈటీకి చెందిన సలీంజునైద్‌ మాడ్యుల్‌
దేశంలోని ప్రధాన నగరాల్లో మత కలహాలు సృష్టించడంతో పాటు విధ్వంసాలకు పాల్పడేందుకు ఐఎస్‌ఐతో పాటు లష్కరేతొయిబా(ఎల్‌ఈటీ) 1985లో కుట్ర పన్నింది. దీని కోసం పాకిస్తాన్‌కు చెందిన సలీం జునైద్‌ను రంగంలోకి దింపింది. నగరానికి వచ్చిన ఇతగాడు పాతబస్తీలో షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని, జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన మరికొందరితో కలిసి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వీరి మాడ్యుల్‌లో సిటీకి చెందిన వారూ చేరారు. వీరంతా సిటీతో పాటు డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్‌లో రెక్కీలు చేసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీన్ని ఛేదించిన పోలీసులు జునైద్‌ సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఇదే మాడ్యుల్‌ ఘట్‌కేసర్‌లోని రైల్వే ట్రాక్‌పై బాంబులు పెట్టింది. దీనిపైనా అక్కడి ఠాణాలో మరో కేసు నమోదైంది.  

ఏసీ గార్డ్స్‌లో హిజ్బుల్‌ముష్కరులు
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన కీలక ఉగ్రవాదులు గుల్జార్‌ అహ్మద్, గులాం మొహియుద్దీన్, అబు బాఖర్, ముర్తుజా అహ్మద్‌లను 2001 జూలై 30న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా కొందరు తమ అనుచరులు నగరంలోని ఏసీ గార్డ్స్‌లో తలదాచుకున్నారని చెప్పారు. దీనిపై ఢిల్లీ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు.

ఇండియన్‌ ముజాహిదీన్‌వెనుకాలష్కరే..
గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో 2007 ఆగస్టు 25న, దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగాయి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ముష్కరులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయితే, ఈ సంస్థ వెనుక ఎల్‌ఈటీతో పాటు ఐఎస్‌ఐ హస్తాలు ఉన్నాయి.  

అప్పట్లోనే అస్ఘర్‌ దుశ్చర్యలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్‌ దారుణ హత్యలో నిందితుడిగా ఉన్న అస్ఘర్‌ అలీ దుశ్చర్యలు 1996లోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కశ్మీర్‌కు వెళ్లిన అలీ.. అక్కడున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆపై ఇండియన్‌ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్‌ (ఐఎంఎంఎం) సంస్థలో కీలకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించాడు. మరికొందరు ముష్కరులతో కలిసి భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు. దీనికోసం కశ్మీర్‌ నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు సేకరించాడు. రెక్కీ వంటి చర్యలు చేపడుతుండగా 1997లో పోలీసులకు ఉప్పందడంతో వీరిని పట్టుకున్నారు. దీనికి ఏడాది ముందు నాంపల్లి కోర్టు నుంచి ఉగ్రవాది మీర్జా ఫయాజ్‌ బేగ్‌ను తప్పించింది సైతం అస్ఘర్‌ అలీనే అని వీరి విచారణతో తేలింది. ఇతడి మాడ్యులే 2003లో జరిగిన గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్య హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంది.  

గణేష్‌ టెంపుల్‌ను పేల్చేయాలని..
సికింద్రాబాద్‌లోని గణేష్‌ దేవాలయం సైతం లష్కరే తొయిబా టార్గెట్‌లో ఉంది. దీన్ని పేల్చేయడానికి 2004లో కుట్ర జరిగింది. నగరానికే చెందిన వారిని తమవైపు తిప్పుకున్న ఎల్‌ఈటీ.. వారికి అవసరమైన పేలుడు పదార్థాలు అందించింది. అనూహ్యంగా ఈ కుట్రను ఛేదించిన సిటీ పోలీసులు మౌలానా నసీరుద్దీన్‌ సహా అనేక మందిని అరెస్టు చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ను పేలడు పదార్థంతో పేల్చేయడం ద్వారా విధ్వంసం సృష్టించి, మత కలహాలు రెచ్చగొట్టాలని లష్కరే తొయిబా కుట్ర చేసింది.  

‘ఓడియన్‌’ ఘాతుకం ఎల్‌ఈటీ పనే..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓడియన్‌ థియేటర్‌లో 2006 మే 7న జరిగిన గ్రెనేడ్‌ పేలుడు సైతం పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) పనే. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగి నగరానికి వచ్చి ‘స్లీపర్‌సెల్‌’గా వ్యవహరించిన మహ్మద్‌ జియా ఉల్‌ హక్‌ ఈ పేలుడుకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు నగరంలోనే తలదాచుకున్న జియాను 2010 మే 3న పట్టుకోగలిగారు. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మహ్మద్‌ జియా ఉల్‌ హక్‌ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. భవానీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఈదిబజార్‌లో స్థిరపడ్డారు. జియా ఇంటర్‌మీడియట్‌ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు.

అక్కడ ఉండగానే పాకిస్తానీ అబు అలీతో పరిచయమై.. అతని ద్వారా ఎల్‌ఈటీ కమాండర్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్‌ అజీజ్‌కు సన్నిహితుడిగా మారాడు. అబు అలీ 1992 బాబ్రీ విధ్వంసం, 2002 గోద్రా అల్లర్లకు చెందిన సీడీలను తరచూ చూపించడంతో స్ఫూర్తి పొందిన జియా ‘ఉగ్ర’ బాటపట్టి 2002లో శిక్షణ కోసం పాకిస్తాన్‌ వెళ్లాడు. అక్కడ నెలరోజుల పాటు ఎల్‌ఈటీ క్యాంప్‌లో శిక్షణ æపొంది ఆపై హైదరాబాద్‌ చేరుకున్న జియా క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎల్‌ఈటీకి స్లీపర్‌సెల్‌గా వ్యవహరించాడు. 2005 డిసెంబర్‌లో ఢిల్లీ రావాల్సిందిగా అజీజ్‌ నుంచి జియాను ఫోన్‌ వచ్చింది. అక్కడకు వెళ్లిన జియాకు ఎల్‌ఈటీ మాడ్యుల్స్‌ ఓ చైనీస్‌ మేడ్‌ తుపాకీ, నాలుగు హ్యాండ్‌ గ్రెనేడ్స్, తూటాలు కొరియర్‌ ద్వారా అందాయి. హైదరాబాద్‌లో ఉన్న జనసమర్థ ప్రాంతాలనే టార్గెట్‌గా విరుచుకుపడాల్సిందిగా ఎల్‌ఈటీ ఆదేశించింది. అప్పటి నుంచి అదును కోసం చూసిన జియా.. 2006 మే 7న తొలి ఆపరేషన్‌ నిర్వహించాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్‌ థియేటర్‌లో ‘లక్ష్మీ’ చిత్రం సెకండ్‌ షో నడుస్తుండగా గ్రెనేడ్‌ విసిరి పరారయ్యాడు. మరో గ్రెనేడ్‌ను డస్ట్‌బిన్‌లో పడేశాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఉదంతం జరిగిన తరవాత కూడా జియా క్యాబ్‌ డ్రైవర్‌గా నగరంలోనే ఉండి ఆయుధాలతో దాడి కోసం ఎదురు చూశాడు. ఓడియన్‌ పేలుడు జరిగిన నాలుగేళ్ల తరవాత జియా ఉల్‌ హక్‌ను నగర పోలీసులు పట్టుకోగలిగారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top