మార్కులు తక్కువొచ్చాయ్‌.. మన్నించండి

Tenth Class Students Missing in Hyderabad - Sakshi

ఇళ్ల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు

తమ కోసం బెంగపడొద్దంటూ ఉత్తరాలు

ప్రయోజకులమయ్యాక తిరిగి వస్తామని వెల్లడి

గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

కుషాయిగూడ: మార్కులు తక్కువగా వచ్చాయని ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు.. హెచ్‌బీకాలనీ తిరుమలనగర్‌కు చెందిన ఎం.చరణ్, ఎస్‌వీనగర్, నాగారానికి చెందిన వై. సామ్యూల్, శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన హేమంత్‌సాయికృష్ణ ఏఎస్‌రావునగర్‌లోని సెయింట్‌ «థెరిసా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరికి ఇటీవల జరిగిన ప్రి ఫైనల్‌ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా.. తమకు మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెందారు వీరు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి ప్రయోజకులుగా మారి తిరిగి రావాలని నిర్ణయించుకొన్నారు.

ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. మంగళవారం ముగ్గురు స్కూల్‌ వెళ్లకుండా డుమ్మా కొట్టారు. ఇంట్లో ఎవరూ గమనించకుండా బ్యాగులు సిద్ధం  చేసుకొని రహస్యంగా భద్రపరుచుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సామ్యూల్, హేమంత్‌సాయికృష్ణ హెచ్‌బీకాలనీలోని చరణ్‌ వద్దకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌బీకాలనీ నుంచి వీరు ముగ్గురు కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. చరణ్, హేమంత్‌లు తమ గురించి బెంగపడొద్దని, తాము క్షేమంగా ఉంటామని, ప్రయోజకులమయ్యాక తిరిగి వస్తామంటూ లేఖలు రాసి పెట్టారు. ఇంటి నుంచి హేమంత్‌ రూ.5 వేలు, సామ్యూల్‌ రూ.6 వేలు నగదు తీసుకెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  ప్రత్యేక బృందాలతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద గాలిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top