ఎంత పని చేశావు నిహారికా

Tenth Class Student Niharika Deadbody Found in Pond Kurnool - Sakshi

నీ బాగుకోసమే మందలించాం

అంతమాత్రాన ఉసురు తీసుకోవాలా?

బోరున విలపించిన తల్లిదండ్రులు

గుడేకల్‌ చెరువులో బాలిక మృతదేహం లభ్యం

‘ఎంత పని చేశావు నిహారికా.. నీ బాగు కోసమే కదమ్మా మందలించింది. బాగా చదువుకోమని చెప్పినందుకే ప్రాణాలు తీసుకుని మాకు కడుపుకోత మిగిల్చావు కదమ్మా’ అంటూ ఆ తండ్రి దుఃఖించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. రెండు రోజుల క్రితం ఎల్‌ఎల్‌సీలో దూకి గల్లంతైన విద్యార్థిని నిహారిక(15) మృతదేహం గురువారం పైకి తేలడంతో పోలీసులు, గజ ఈగతాళ్ల సాయంతో బయటకు తీశారు. కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు స్వల్పంగా తినేయడం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ తండ్రి వాసుబాబు గుండెలు బాధుకున్నాడు.

సాక్షి, ఎమ్మిగనూరు రూరల్‌(కర్నూలు): ప్రకాశం జిల్లా కొనికి గ్రామానికి చెందిన వాసుబాబు, వెంకటరమణమ్మ పదిహేనేళ్ల ఏళ్ల కిత్రం ఎమ్మిగనూరుకు వలసవచ్చి పొలాలు కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని సోమప్ప నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి సీతామహాలక్ష్మీ, నిహారిక(15), వర్థిని సంతానం. నిహారిక స్థానిక రవీంద్ర స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తెలిసి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు మందలించారు. బాగా చదువుకోవాలని సూచించారు. మందలించడాన్ని అవమానంగా భావించి మంగళవారం ఉదయం ఎల్‌ఎల్‌సీ వద్దకు వెళ్లి సైకిల్‌ గట్టుపై పెట్టి కాలువలో దూకేసింది. సైకిల్‌ను ఆధారంగా చేసుకొని పోలీసులు, అగ్నిమాపక పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టిన బాలిక మృతదేహం కనిపించలేదు.

ప్రభుత్వాసుపత్రి వద్ద రోదిస్తున్న బాలిక తల్లి, కుటుంబ సభ్యులు

రెండు రోజులైనా మృతదేహం కనిపించకపోవటంతో సైకిల్‌ పెట్టి ఎక్కడికైనా వెళ్లిందేమోనని, తమ కుమార్తె బతికే ఉంటుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూశారు. గురువారం ఉదయం చెరువులో బాలిక మృతదేహం ఉండటాన్ని గమనించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. బాలిక కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు తినివేయడాన్ని చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. చెరువు వద్దకు టౌన్‌ సీఐ వి. శ్రీధర్, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, ఫైర్‌ ఎస్‌ఐ మోహన్‌బాబులు చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు టౌన్‌ సీఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top