‘భక్తితో’ తస్కరిస్తూ!

Temple Thief Rambabu Arrest In Hyderabad - Sakshi

గుడిదొంగ రాంబాబు మరోసారి కటకటాల్లోకి

దేవాలయాలనే టార్గెట్‌గా చేసుకుని నేరాలు

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 57 కేసులు

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన గుడి దొంగ నేపథ్యం

సాక్షి, సిటీబ్యూరో: డబ్బు అవసరమైన ప్రతిసారీ పొద్దున్నే లేస్తాడు... కాలకృత్యాలు తీర్చుకుని తన బైక్‌పై దేవాలయానికి వెళ్తాడు... పూలు, పళ్లు సమర్పించి ‘భక్తితో’ నమస్కరిస్తాడు... పూజారికి దక్షిణ సైతం సమర్పిస్తాడు... ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ అప్పుడే ప్రారంభిస్తాడు... అదును చూసుకుని గుడిలో ఉన్న దేవతల విగ్రహాలపై ఉన్న ఆభరణాలు తస్కరించి ఉడాయిస్తాడు... ఈ పంథాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలు చేసిన గుడిదొంగ ఈమని రాంబాబుపై పీడీ యాక్ట్‌ ప్రయోగించినా మారలేదు. జైలు నుంచి వస్తూనే ఏపీలోనూ అరెస్టై బెయిల్‌ పొంది సిటీలో పంజా విసిరాడు. ఇతడిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఇతను ఆ అడ్డాల్లోనే తిరుగుతూ అందుకు అవసరమైన డబ్బు కోసమే దాదాపు పదేళ్ల క్రితం దొంగగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘరానా దొంగను పట్టుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను డీసీపీ  రాధాకిషన్‌రావు అభినందించారు. 

గుడి పదిలమనే భావనతో...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, తాటిపాక గ్రామానికి చెందిన రాంబాబుకు రామ్‌ పవన్‌ అనే మారు పేరు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన ఇతగాడు మీర్‌పేటలో స్థిరపడ్డాడు. బతుకుతెరువు కోసం ముత్యాల వ్యాపారం ప్రారంభించినా అందులో వచ్చే సొమ్ము కుటుంబపోషణకే సరిపోయేది కాదు. పదేళ్ల క్రితం ఇతడికి ఏర్పడిన చెడు స్నేహాలతో స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఆ తరహాకు చెందిన వారు ఉండే అడ్డాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఆ పని కోసమే ఖర్చు పెట్టడం మొదలెట్టాడు.

ఇలా ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాలు చేయాలని నిర్ణయించుకున్న ఇతడి దృష్టి చిన్న, మధ్య తరహా దేవాలయాలపై పడింది. వాటిలో రద్దీ, భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. ఉదయం పూట తన బైక్‌పై బయలుదేరే ఇతను మార్గ మధ్యంలో పూలు, పళ్లు ఖరీదు చేసుకుని వెళ్తాడు. 

రెండు పంథాల్లో పంజా విసిరి...
తాను ఎంచుకున్న దేవాలయం వద్దకు వెళ్లిన తర్వాత చుట్ట పక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తాడు. పూజారి అందుబాటులో లేకుంటే తానే గర్భగుడిలోకి ప్రవేశించి పూలు, దండలు, పళ్లు సమర్పిస్తున్నట్లు నటిస్తాడు. అదును చూసుకుని దేవతా విగ్రహాలకు ఉన్న ఆభరణాలు ఎత్తుకుని ఉడాయిస్తాడు. ఒకవేళ పూజారి గుడిలోనే ఉంటే దక్షిణగా రూ.500 ఇస్తూ... చిల్లర తిరిగి ఇవ్వమని కోరతాడు. అది తీసుకురావడానికి పూజారి వెళ్లినప్పుడు తన ‘పని’ పూర్తి చేసుకుని ఆయన తిరిగి వచ్చేలోగా మాయమవుతాడు. హైదరాబాద్‌లో వరుస నేరాలు చేసిన తర్వాత పోలీసులకు చిక్కి అరెస్టైతే మకాం మారుస్తాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కుటుంబంతో సహా ఏపీకి షిఫ్ట్‌ అయి అక్కడ నేరాలు ప్రారంభిస్తాడు. అక్కడి పోలీసులు అరెస్టు చేస్తే... బయటకు వచ్చాక సిటీకి మకాం మార్చి ‘పని’ మొదలు పెడతాడు. 

పీడీ యాక్ట్‌ ప్రయోగించినా...
దేవాలయాలనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న ఇతని కారణంగా ఒక్కోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 53 నేరాలు చేసిన ఇతడిపై సిటీ పోలీసులు 2015లో పీడీ యాక్ట్‌ సైతం ప్రయోగించారు. ఆ ఏడాది మార్చ్‌ నుంచి 2016 అక్టోబర్‌ వరకు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇతను బయటకు వచ్చాక ఏపీకి వెళ్లాడు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో చోరీలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ కేసుల్లో బెయిల్‌ పొందిన తర్వాత నెల రోజుల క్రితమే సిటీకి వచ్చాడు. మళ్లీ చోరీలు ప్రారంభించి గత నెల 26న బేగంబజార్, కాచిగూడలోని భూలక్ష్మీ, పొచమ్మ దేవాలయాల్లో, గత బుధవారం మాదన్నపేటలోని భూలక్ష్మీ గుడిలో,  గురువారం కార్ఖానాలోని నాగదేవత టెంపుల్‌లో పంజా విసిరాడు. కాచిగూడ దేవాలయంలోని సీసీ కెమెరాల్లో ఇతడి కదలికలు రికార్డు కావడంతో వీటి ఆధారంగా రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై కేఎస్‌ రవి కీలక ఆధారాలు సేకరించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌ వలపన్ని శనివారం నిందితుడిని పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 19 గ్రాముల బంగారం, 15 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని బేగంబజార్‌ పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top