
రాజమహేంద్రవరం మద్యం సిండికేట్‌లో చక్రం తిప్పుతున్న టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతృత్వంలోని మద్యం సిండికేట్ బరితెగింపు బహిర్గతమైంది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్‌లో ఉన్న లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఏ బ్రాండ్‌పై ఎమ్మార్పికంటే ఎంత ఎక్కువ వసూలు చేయాలి? బెల్ట్ షాపులు ఎవరు పెట్టుకోవాలి? ఎక్సైజ్ అధికారులకు ఎంత మామూళ్లు ఇవ్వాలి? కేసులు లేకుండా వారిని ఎలా మేనేజ్ చేయాలి? ఒకవేళ కేసులు పెడితే అధికారులు ఎన్ని కేసులు ఏ విధంగా పెట్టాలో కూడా నిర్దేశించేందుకు రాజమహేంద్రవరం నగరంలోని ఆనంద్ రీజెన్సీ హోటల్‌కు రావాలని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు రాజమండ్రి రూరల్, సిటీ నియోజకవర్గాల్లోని 39 లిక్కర్ షాపుల యజమానులకు ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్‌పై సంతకాలు కూడా చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈమేరకు ఓ మద్యం షాపు యజమానితో ఆయన మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఈ సమావేశం వెనుక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థం అవుతోంది.
మజ్జి రాంబాబు ఓ లిక్కర్ షాపు యజమానితో మాట్లాడిన ఆడియోలో ఉన్నదిదీ..
⇒ రాజమండ్రి సిటీ, రూరల్ పరిధిలో ఉన్న 39 షాపుల యజమానులు ఒకే తాటి పైకి రావాలి. ఎమ్మార్పీకంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఏ బ్రాండ్‌పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. ఎక్కువ ధరకు అమ్మినా ఎక్సైజ్ అధికారులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారికి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఇప్పటికే ఎక్సైజ్ నార్త్, సౌత్ సీఐలను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్లు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా రూ.2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత? రూ.2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూళ్లు ఎక్సైజ్ అధికారులకు ఇప్పించాలో నిర్ణయిస్తామన్నారు.
⇒ సిండికేట్లలోని షాపులపై ఎక్సైజ్ అధికారులు కేసులు పెడితే ఒక షాపుపై ఒకటి మాత్రమే నమోదు చేయాలి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒకే షాపుపై రెండు కేసులు పెడితే ఆ షాపు రద్దు అవుతుంది. అందువల్ల ఎక్సైజ్ అధికారులకు లెక్కల కోసం కేసులు కావాలంటే ఏదో ఒక షాపుపై కేసు పెడితే, మిగతా అన్ని షాపుల యజమానులు ఆ ఫైన్ కట్టాలి. ఈ విషయమై 39 షాపుల యజమానుల నుంచి బాండ్ పేపర్‌పై సంతకాలు తీసుకోవడంతో పాటు, రూ.లక్ష విలువ చేసే చెక్కులు తీసుకోవాలి.
⇒ మద్యం షాపుల నిర్వహణలో సిండికేట్‌లోని 39 షాపుల యజమానులు ఐక్యతతో ముందుకు సాగాలి. ఏ ఏరియాలో బెల్ట్ షాపులు పెడుతున్నారో అదే ఏరియాలో ఉన్న మద్యం దుకాణంలో మద్యం కొనేలా చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకునేందుకు సాయంత్రం ఆనంద్ రీజెన్సీలో సమావేశం పెట్టాం. అక్కడికి ఎక్సైజ్ అధికారులు కూడా వస్తున్నారు. మీరు కూడా రావాలి అంటూ మజ్జి రాంబాబు ఆ దుకాణం యజమానికి హుకుం జారీ చేసినట్లు ఆ ఆడియోలో ఉంది.